పాట్నా : ఈ ఏడాది చివర్లో బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఆయనకు పలు సూచనలు అందినట్లు సమాచారం. బిహార్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించనున్నారు. బిహార్‌లో నిన్న (గురువారం) జరిగిన ఓ ముఖ్యమైన పార్టీ సమావేశానికి సైతం ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపై ఎన్నికలకు సంబంధించి ఆయనే కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ నాయకులకు పలు సూచనలు అందాయి. (ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసలు)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ర్ట, బిహార్ ప్రభుత్వాల మధ్య రాజకీయ చిచ్చు రగులుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సొంత రాష్ర్టమైన బిహార్ అతని మరణాన్ని సైతం రాజకీయాలకు వాడుకుంటోందని మహారాష్ర్ట ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికే ఉద్దవ్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసు విచారణకు అడ్డం పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా మహారాష్ర్ట సర్కార్‌పై పలు వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు సుశాంత్ మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో ఫడ్నవిస్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బిహార్ బీజేపీ కోర్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి భూపేంద్ర యాదవ్ ఉన్నారు. భూపేంద్ర యాదవ్ గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. బిహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 29 తో ముగియడంతో అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరగునున్నట్లు సమాచారం. అయితే కరోనా కారణంగా ఎన్నికల తేదీలపై ఇంకా తేదీ వివరాలు వెల్లడికాలేదు. (ప్రజలకు సుశాంత్ సోదరి విజ్ఞప్తి)
Comments
Please login to add a commentAdd a comment