ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం బుధవారం 13వ రోజుకు చేరింది. ఇరు వర్గాల పోరులో మరణించిన వారి సంఖ్య అయిదు వేలకు చేరువైంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 3,478 మంది పాలస్తీనియన్లు మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. మరో 4,562 మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్ ఆధీనంలోనే ఉన్నారు.
తరలింపు కష్టం
తాజాగా గాజాలోని భారతీయుల తరలింపుపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారని, ప్రస్తుతం వారిని తరలించే పరిస్థితి లేదని ఏఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. గాజాలో పరిస్థితి కారణంగా పౌరుల తరలింపు కష్టంగా మారిందని.. అయితే అవకాశం దొరికితే వారిని స్వదేశానికి తీసుకొస్తామని చెప్పారు. నలుగురిలో ఒకరు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
భారతీయులెవరూ మరణించలేదు
గాజాలో పౌరుల మరణాలు, మానవతా పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతోందని అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన.. ఇజ్రాయెల్- గాజా పోరులో ఇప్పటి వరకు ఏ ఒక్క భారతీయుడు ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు.కే రళకు చెందిన ఓ మహిళా కేర్‌టేకర్, తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలిపారు.
చదవండి: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్
నేరుగా చర్చించాలి
‘ఆపరేషన్ అజయ్’ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయిదు విమానాల్లో1,200 మందిని ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు తరలించినట్లు బాగ్చీ వెల్లడించారు. వీరిలో 18 మంది నేపాలీ పౌరులు కూడా ఉన్నారు. 2002-23 మధ్యకాలంలో పాలస్తీనాకు భారత్ దాదాపు 30 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాలస్తీనాపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుందన్నారు. ఈ సమస్యపై పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోందని చెప్పారు.
దారుణంగా గాజా పరిస్థితి
హమాస్ మిలిటెంట్లు, వారి కార్యకాలపాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజా ప్రాంతంలో పరిస్థితులు ఆధ్వానంగా మారాయి. ఆహారం, నీరు, కరెంట్ కోతలతో పాలస్తీనియన్లు అల్లాడుతున్నారు. వేలాది నిరాశ్రయులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఆదేశాలతో లక్షలాది మంది ఉత్తర గాజా నుంచి తరలివెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment