ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు! | Dummy CM, sad day for Delhi says AAP MP Swati Maliwal slams Atishi | Sakshi
Sakshi News home page

ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!

Published Wed, Sep 18 2024 5:59 AM | Last Updated on Wed, Sep 18 2024 9:18 AM

Dummy CM, sad day for Delhi says AAP MP Swati Maliwal slams Atishi

రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్‌ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్‌ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్‌ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్‌ ఆరోపించారు.

 ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్‌ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌ కాపీని కూడా మలివాల్‌ షేర్‌ చేశారు. వీటిపై ఆప్‌ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే స్పందిస్తూ..‘ఆప్‌ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్‌..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. 

ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్‌ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్‌ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్‌ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement