ఢిల్లీ: మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయి ఓటింగ్ శాతంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం(మే 13న) వెలువడబోయే ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. సర్వేలన్నీ దాదాపుగా అనుకూలంగా వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ఆరోపించడం.. దానికి బదులుగా ఎన్నికల సంఘం లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించింది. కర్ణాటక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలన్నీ కొత్తవేనని, క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే వాటిని ఎన్నికల్లో ఉపయోగించామని కాంగ్రెస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను గతంలో దక్షిణాఫ్రికాలో ఎన్నికల కోసం ఉపయోగించారని!. వాటిని తెప్పించి కనీసం పనితీరును పరిశీలించకుండా కర్ణాటక ఎన్నికలకు ఉపయోగించారని. అయితే ఈసీ ఈ అనుమానాల్ని, ఆరోపణల్ని ఖండించింది. ఈవీఎంలను తాము సౌతాఫ్రికాకు ఎన్నడూ పంపలేదని స్పష్టం చేసింది.
అంతేకాదు ఎన్నికల కోసం వాడిన ఈవీఎంలు కొత్తవేనన్న విషయం కాంగ్రెస్‌కు తెలుసని ఈసీ పేర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నది నిరాధారాపూరిత ఆరోపణలని, ఉద్దేశపూర్వకంగా కనిపిస్తున్న ఆ ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉండొచ్చని, మే 15 సాయంత్రం ఐదు గంటలలోపు ఆ ఆరోపణల వెనుక ఉన్నవాళ్ల పేర్లను, వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ కమిటీని లేఖలో ఈసీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment