కోల్కతా: పశ్చిమ బెంగాల్ జార్ గ్రామ్ గ్రామంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడైనా విందు భోజనం వాసన వస్తే చాలు ఇట్టే పసిగట్టి క్షణాల్లో వాలిపోయి మొత్తం ఆహారాన్ని లాగించేస్తున్నాయి. తాజాగా జార్ గ్రామ్ లో ఓ పెళ్ళిలో ఏనుగులు ఇలాగే హల్ చల్ చేయడంతో అతిథులంతా చెల్లాచెదురు కాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం బైక్ పైన ఉడాయించారు.
ఇటీవలి కాలంలో జార్ గ్రామ్ గ్రామ సరిహద్దుల్లో ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఊళ్ళో ఎక్కడ భోజనం వాసన వచ్చినా వెంటనే వెళ్లి ఆవురావురుమంటూ లాగించేస్తున్నాయి. అందుకే స్థానికంగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా వణికిపోతున్నారు.
ఆదివారం జార్ గ్రామ్ సమీపంలోని జోవాల్ భంగా గ్రామంలో తన్మోయ్ సింఘా, మంపి సింఘా వివాహం జరుగుతుండగా వివాహ కార్యక్రమం అప్పుడే పూర్తై అతిధులు భోజనాలకు సిద్ధమవుతున్నారు. అంతలో రొయ్యలు, ఉలవచారు, బంగాళాదుంపల కుర్మాలతో కూడిన మెనూ వాసనలు వెదజల్లుతూ ఏనుగులను స్పృశించాయి.
ఇంకేముంది ఆహ్వానం లేకుండానే పెళ్ళికి వచ్చి అతిధుల కంటే ముందే విందునారగించేందుకు తయారయ్యాయి. కళ్యాణ మండపంలో అవి చేసిన రాద్ధాంతానికి అతిథులంతా భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా పారిపోయి చుట్టుపక్కల ఇళ్లలో నక్కారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఎలాగోలా బైక్ ఒకటి సంపాదించి దానిపైన పారిపోయారు.
చాలా రోజులుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఏనుగులకు భయపడి ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడి అభ్యర్థులు ఏనుగుల గుంపులు భయపడి ఆర్భాటాలు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ప్రచారాన్ని నిర్వహించారు.
ఇది కూడా చదవండి: తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి..
Comments
Please login to add a commentAdd a comment