
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారిగా కేంద్ర కేబినెట్ గురువారం రోజున భేటీ జరిగింది. కేంద్ర కేబినెట్ వ్యవసాయం, హెల్త్ రంగాలపై కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనాను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ కింద సుమారు రూ.23,123 కోట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 736 జిల్లాల్లో పిల్లల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు.
అంతేకాకుండా కొత్తగా 20వేల ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయని మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4,17,396 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు . జిల్లాస్థాయిలో 10వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెలి మెడిసిన్ ద్వారా వైద్యం అందించేందుకు చర్యలను ముమ్మరం చేశామని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు
వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి లక్ష కోట్ల నిధులను కేటాయించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు . మూడు వ్యవసాయ చట్టాల అమలులో భాగంగా వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కృషిచేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎంసీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తోమర్ పేర్కొన్నారు. రైతుల మౌలిక సౌకర్యాల నిధిని ఏపీఎంసీలు వాడుకోవచ్చునని తోమర్ స్పష్టం చేశారు. సాగు చట్టాల అమలుతో ఏపీఎంసీలకు మరిన్ని నిధులు చేకూరుతాయని తెలిపారు.