
జర్నలిస్ట్ అల్ షరీఫ్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించిన ఇజ్రాయెల్
ఖండించిన పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు
డెయిర్ అల్–బలాహ్: గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్‌జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్‌తోపాటు మరో నలుగురు జర్నలిస్టులు మరణించారు. ఈ దాడుల్లో కరస్పాండెంట్ మహ్మద్ క్రీకే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలీవా, వారి సహాయకుడు మహ్మద్ నౌఫల్ మరణించినట్లు అల్‌జజీరా ధ్రువీకరించింది. అల్–షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర్లో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం ఏడుగురు మరణించారని అల్–షిఫా ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు.
కాగా, అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు, అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రెండు గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్‌ను అతని ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం’ . అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
అల్ షరీఫ్ హమాస్ నాయకుడు: ఐడీఎఫ్
అయితే.. వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్.. హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు ఆయన నాయకత్వం వహించాడు’ అని ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ఒక ప్రకటనలో తెలిపింది. అల్ షరీఫ్‌పై ఇజ్రాయెల్ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఐరీన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు.. ఫ్రంట్‌లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే హెచ్చరించారు.
ఖండించిన జర్నలిస్టు సంఘాలు..
జర్నలిస్టుల హత్యను పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వారు ఉగ్రవాదులు కాదని, అలా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్‌బర్గ్ తెలిపారు. ‘ప్రస్తుత యుద్ధంలోనే కాదు, గత దశాబ్దాల్లోనూ ఇజ్రాయెల్ నమూనా ఇది. జర్నలిస్టును చంపడం.. అతను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఇజ్రాయెల్ దళాలు పనిగట్టుకొని చేస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు.