
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు.
కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది.
ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా.
చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Credits: Mathrubhumi News
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి
Comments
Please login to add a commentAdd a comment