బనశంకరి: ఇవాళ మా అమ్మ పుట్టినరోజు.. అమ్మతో మాట్లాడాలి.. ఒక్కసారి మొబైల్ ఇవ్వండి.. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్ వార్డెన్ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిన ఆ పసి హృదయం ఆత్మహత్యకు తెగించింది. కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్ పాఠశాల హాస్టల్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుళ దంపతుల కుమారుడు పూర్వజ్ (14) ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పూర్వజ్ తల్లి మంజుళ పుట్టిన రోజు. తల్లితో ఒకసారి మాట్లాడతానని, మొబైల్ ఇవ్వాలని బాలుడు హాస్టల్ వార్డెన్‌ను కోరగా, అందుకు వార్డెన్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పూర్వజ్ శనివారం రాత్రి 12 గంటల వరకు ఒంటరిగా గడిపాడు. తరువాత డెత్‌నోట్ రాసి హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.
చదవండి: (Telangana: ఆకాశంలో అద్భుతం)
కన్నీరు తెప్పించే డెత్‌నోట్
ఆదివారం ఉదయం పూర్వజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే హాస్టల్‌లో కలకలం చెలరేగింది. బాలుని ఆత్మహత్యకు విద్యా సంస్థ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెనే కారణమని మంజుళ సోదరుడు అరుణ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డెత్‌నోట్‌లో.. ‘‘అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి.. మీరు నన్ను దుఃఖంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు.’’ అని బాలుడు రాసిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment