‘గగన్‌యాన్‌’ TV-D1 ప్రయోగం సక్సెస్‌ | Gaganyaan Mission: ISRO begins countdown for first test flight | Sakshi
Sakshi News home page

ఇస్రో ‘గగన్‌యాన్‌’ TV-D1 ప్రయోగం సక్సెస్‌

Published Sat, Oct 21 2023 7:36 AM | Last Updated on Sat, Oct 21 2023 11:21 AM

Gaganyaan Mission: ISRO begins countdown for first test flight - Sakshi

సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్‌ మిషన్‌లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’(టీవీ-డీ1)ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్‌ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్‌ పారాచూట్‌ల సాయంతో కిందకు సురక్షితంగా  ల్యాండ్‌(సముద్రంలోకి) అయ్యింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్‌ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం ‍వ్యక్తం చేశారు.  


గగన్‌యాన్‌ టెస్ట్‌ లాంచ్‌ విజయవంతం అయ్యిందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. టీవీ-డీ1 మిషన్‌ను విజయవంతంగా పరీక్షించాం. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగాం. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాని సరిచేసి మళ్లీ ప్రయోగించాం. పారాచ్యూట్‌లు సమయానికి తెరుచుకున్నాయి. క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది అని వెల్లడించారాయన. 

టీవీ-డీ1 ఎందుకంటే..
గగన్‌యాన్‌కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌(టీవీ-డీ1) మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమితస్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఇందులో క్రూ(వ్యోమగాముల) ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.

అంతరాయం తర్వాత..
తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించగా.. ఈ సన్నాహక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.

ఎందుకు కీలకం అంటే..
వ్యోమగాములతో వెళ్లే రాకెట్‌లో ఏదైనా లోపం ఎదురైతే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్‌ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌(సీఈఎస్‌) అంటారు. అంటే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షిస్తున్నారు. క్రూ మాడ్యూల్‌ను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థలో పది పారాచూట్లు ఉంటాయి.

ప్రస్తుతానికి మానవరహితంగానే..
భవిష్యత్‌లో ఇవాళ ప్రయోగించిన క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాములు పయనిస్తారు. కానీ, ఇవాళ మాత్రం మానవరహితంగానే ప్రయోగం జరిపింది ఇస్రో.

గన్‌యాన్‌ ఉద్దేశం..  
గగన్‌యాన్‌లో ముగ్గురు వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. 

నేటి పరీక్ష ఇలా జరిగింది.. 

రాకెట్‌ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు ‘అబార్ట్‌’ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. సింగిల్‌ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని.. 531.8 సెకన్లలో(8.85 నిమిషాల్లో) పూర్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement