
ఒక సామాన్యురాలు అసామాన్య విజయం సాధిస్తే.. అది చరిత్ర సృష్టించినట్లే కదా!. పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి Chinta Devi ఆ జాబితాలోకి చేరిపోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ గయలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
నలభై ఏళ్ల చరిత్ర ఉన్న గయ మున్సిపాలిటీలో చింతాదేవి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన అధికంగా ఉండేది. చింతాదేవి అదంతా ఊడ్చి శుభ్రం చేసి, ఎత్తి దూరంగా తీసుకెళ్లి పారబోసే పనిని చేశారు. ఆ తర్వాత రోడ్లు ఊడవడం, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌కు శుభ్రం చేస్తూ వస్తున్నారు. అలాంటి చింతాదేవి ఎన్నికల్లో పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. ప్రజలకు నిత్యం చేరువగా ఉండడంతోనే తనకు ఈ విజయం దక్కి ఉంటుందని ఆమె భావిస్తున్నారు.
బహుశా ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరూ సాధించి ఉండబోరని, ఇది చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేష్ పాశ్వాన్ ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు.. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికురాలిగానే కాదు.. మిగతా టైంలో ఆమె కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు.
బుద్ధుడి జ‍్క్షానోదయ ప్రాంతంగా పేరున్న గయలో.. ఇలాంటి గెలుపు కొత్తేం కాదు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో రాళ్లు కొట్టి జీవనం కొనసాగించే భగవతి దేవి ఏకంగా పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. అంటరాని కులంగా పేరున్న ముసహార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జేడీయూ పార్టీ తరపున పోటీ చేసి ఆమె నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment