manual scavengers
-
సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ భట్ పేర్కొన్నారు. -
చరిత్ర సృష్టించిన చింతాదేవి.. డిప్యూటీ మేయర్‌గా..
ఒక సామాన్యురాలు అసామాన్య విజయం సాధిస్తే.. అది చరిత్ర సృష్టించినట్లే కదా!. పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి Chinta Devi ఆ జాబితాలోకి చేరిపోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ గయలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న గయ మున్సిపాలిటీలో చింతాదేవి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన అధికంగా ఉండేది. చింతాదేవి అదంతా ఊడ్చి శుభ్రం చేసి, ఎత్తి దూరంగా తీసుకెళ్లి పారబోసే పనిని చేశారు. ఆ తర్వాత రోడ్లు ఊడవడం, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌కు శుభ్రం చేస్తూ వస్తున్నారు. అలాంటి చింతాదేవి ఎన్నికల్లో పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. ప్రజలకు నిత్యం చేరువగా ఉండడంతోనే తనకు ఈ విజయం దక్కి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరూ సాధించి ఉండబోరని, ఇది చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేష్ పాశ్వాన్ ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు.. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికురాలిగానే కాదు.. మిగతా టైంలో ఆమె కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. బుద్ధుడి జ్క్షానోదయ ప్రాంతంగా పేరున్న గయలో.. ఇలాంటి గెలుపు కొత్తేం కాదు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో రాళ్లు కొట్టి జీవనం కొనసాగించే భగవతి దేవి ఏకంగా పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. అంటరాని కులంగా పేరున్న ముసహార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జేడీయూ పార్టీ తరపున పోటీ చేసి ఆమె నెగ్గారు. -
మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్హెచ్ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ఎన్హెచ్ఆర్సీ సిఫార్సులు ► మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి. ► కార్మికుల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ► సెప్టిక్ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. ► ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వర్తింపజేయాలి. ► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి. ► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. ► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి. -
నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది!
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మాన్యువల్ స్కావెంజర్ (పాకీ) వృత్తిలో ఇప్పటికీ మూడు లక్షల మంది కొనసాగుతూనే ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. చట్టం చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతూ ఉండటాన్ని గర్హిస్తున్నామని, ఆ వృత్తిలో కొనసాగుతున్నవారి వివరాలు తెలపాలని ఆయా రాష్ట్రాలను కోరినట్లు మంత్రి చెప్పారు. 2011 జనగణనలో దేశవ్యాప్తంగా 26 లక్షల బహిరంగ మలవిసర్జన కేంద్రాలు ఉన్నట్లు నమోదయిందని, ఆ గణంకాల ఆధారంగా రమారమి మూడు లక్షల మంది ఇకా ఈ వృత్తిలోనే ఉన్నారని అర్ధమవుతుందని పేర్కొన్నారు. వివరాలు సేకరించిన అనంతరం వారికి పునరావసం కల్పిస్తామన్నారు. బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ వృత్తి అత్యంత దారుణమైనదిగా భావించిన కోర్టు ఆ విధానాన్ని రద్దుచేయాలని ఆదేశించడంతో 2013 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం 'పాకీ పని రద్దు, వారికి పునరావాసం' చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.