
ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న ఉద్యోగాలను ఉత్తరాది వారికే ఇస్తున్నారంటూ ఢిల్లీలో చదువుకుంటున్న తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్‌ఏ)కు చెందిన విద్యార్థి నేతలు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు బైఠాయించిన విద్యార్థులు మా జాబులు, మాకే కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
74 మంది ఉద్యోగుల్లో నలుగురే తెలంగాణ వాళ్లు..
తెలంగాణ భవన్ రాష్ట్ర ప్రజలు, విద్యార్థుల ఆత్మగౌరవమని కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన భవన్‌లలో సొంత రాష్ట్రాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు వివేక్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌లోనూ ఆంధ్రా ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే, తెలంగాణ భవన్‌లో మాత్రం ఈ వివక్ష ఎందుకని విద్యార్థులు ప్రశ్నించారు. ఈ అంశంపై జూన్ 22న తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను కలిసి ఈ అన్యాయంపై వినతిపత్రం అందించామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణభవన్‌లో మొత్తం 74 మంది ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తుండగా, అందులో కేవలం నలుగురు మాత్రమే తెలంగాణకు చెందినవారని, మిగతా వారంతా ఉత్తరాదికి చెందిన ఇతర రాష్ట్రాల వారే ఉన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ విద్యార్థులతో చర్చలు జరిపారు. విద్యార్థుల సంఘం చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment