జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్‌లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు.
తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్‌ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment