సాక్షి, న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా మొక్కవోని దీక్షలతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్న రైతు సంఘాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. 24 గంటల్లోగా రహదారులను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఘాజీపూర్ రహదారిని ఖాళీ చేయాల్సిందిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గురువారం పోలీసులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాల అందుకున్న పోలీసులు రహదారులపై రైతులను ఖాళీ చేయించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. సింఘు బోర్డర్ వద్ద రైతులు రహదారులను దిగ్బంధించడం వల్ల.. తమకు అసౌకర్యం కలుగుతోందంటూ స్థానికుల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. (రైతు ఉద్యమంలో చీలికలు)
మరో ఎదురుదెబ్బ..
రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులకు రిపబ్లిక్ డే రోజున కిసాన్ ర్యాలీలో హింస చెలరేగడంతో దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షల నుంచి ఒక్కొక్కరూ వైదులుగుతున్నారు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుమారు గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమంలో చీలికలు ప్రారంభమయ్యాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఘటనలకు నిరసనగా రైతు ఆందోళనల నుంచి విరమించుకుంటున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(భాను), రాష్ట్రీయ కిసాన్ ఆందోళన్ సంఘటన్ బుధవారం ప్రకటించాయి. తాజాగా మరో రెండు రైతు సంఘాలు నిరసనల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాయి. కిసాన్ మహా పంచాయత్, భారతీయ కిసాన్ యూనియన్ (లోక్‌శక్తి) వర్గం వైదొలుగుతున్నట్టు ప్రకటించాయి. బీకేయూ (లోక్‌శక్తి) వర్గం ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో బైఠాయించగా.. కిసాన్ మహా పంచాయత్ వర్గం రాజస్తాన్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతు దీక్షల నుంచి ఆందోళన విరమించిన రైతు సంఘాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల నుంచి రైతులు సైతం ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నా రైతులకు చివరకు నిరాశే మిగిలింది.
అమిత్ షా పరామర్శ..
గణతంత్ర దినోత్సవం రోజు రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మేధాపాట్కర్, యోగేంద్ర యాదవ్‌లతో పాటు మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మంగళవారంనాటి ఢిల్లీ నిరసనల్లో 394 మంది పోలీసులు గాయపడ్డారు. రైతు నేతలపై సమయపూర్ బద్లి పోలీసు స్టేషన్లో ఐపీసీ 147(అల్లర్లు, విధ్వంసం), 148(అల్లర్లు, విధ్వంసం), 307(హత్యాయత్నం), 120బీ(నేరపూరిత కుట్ర) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయపడ్డ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment