ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హథ్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియరాలేదు.
అయితే ఈ విషాదంపై దర్యాప్తులో భాగంగా ఆయన ఆదాయం, సంపద వెలుగు చూసింది. గత ఇరవై ఏళ్ల కాలంలో భేలే బాబా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
కాస్‌గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు.
ఇక భోలే బాబా సూరజ్‌పాల్ మెయిన్‌పురిలోని విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివాసముంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రాజభవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ. 4 కోట్లతో నిర్మించారు.ఆయన భక్తులలో ఒకరు ఈ స్థలాన్ని బాబాకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.
ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.
ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా.. ముందు ఆయన కమాండోలు బైక్‌లపై దారిని క్లియర్ చేస్తారు. అదే విధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది.
యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా 1999లో కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి బోధించడం ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, కార్లపై ప్రీతి కలిగిన ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని తన భక్తుల పేర్లతో కొనుగోలు చేసేవాడు.
హథ్రాస్‌లోని భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సత్సంగ్‌ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.
ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేవలం 80,000 మందికి మాత్రమే అనుమతినివ్వగా.. దాదాపు 2.5 లక్షల మంది అనుచరులు తరలివచ్చారని పోలీసులు తెలిపారు. భోలే బాబా వేదిక నుంచి వెళుతున్న సమయంలో అతని కాన్వాయ్ ద్వారా తన్నిన ధూళిని సేకరించడానికి భక్తుల గుంపు పరుగెత్తుకొచ్చింది, ఇది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే గుంపును నియంత్రించే ప్రయత్నంలో వాలంటీర్లు, అతని భద్రత సిబ్బంది ప్రజలను వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతో అనేక మంది భక్తులు గుంపుగా పడి నలిగిపోయారు. అక్కడి నుంచి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.
అయితే ఇప్పటి వరకు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్‌ఐఆర్‌లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment