అహ్మదాబాద్: ఇద్దరు న్యాయమూర్తుల వాగ్వాదానికి గుజరాత్ హైకోర్టు వేదికైంది. న్యాయమూర్తులు జస్టిస్ బీరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ ధర్మాసనం సోమవారం ఓ కేసును విచారిస్తున్న సందర్భంగా ఈ ఉదంతం జరిగింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలపై వారిద్దరూ విభేదించారు. అనంతరం జస్టిస్ వైష్ణవ్ వెలువరించిన తీర్పుతో జస్టిస్ భట్ ఏకీభవించలేదు. దాంతో, ‘కావాలంటే మీరు విభేదించండి. ఇప్పటికే ఒక కేసులో మనం విభేదించాం. ఇందులోనూ అలాగే చేయవచ్చు’ అని జస్టిస్ వైష్ణవ్ అన్నారు.
ఇది కేవలం విభేదించడానికి సంబంధించిన విషయం కాదంటూ జస్టిస్ భట్ ఏదో చెప్పబోగా, ‘మరైతే గొణగకండి. విడి తీర్పు వెలువరించండి. మనమిక తదుపరి కేసులు చేపట్టబోవడం లేదు’ అంటూ తన స్థానం నుంచి లేచారు. ధర్మాసనం తదుపరి కేసులు ఆలకించబోదని చెబుతూ కోర్టు రూమ్ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కోర్టు రూములోని సీసీ కెమెరాలో రికార్డయింది. గుజరాత్ హైకోర్టులో అన్ని బెంచ్‌లు జరిపే విచారణలూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. జడ్జిల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను కాసేపటికే యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ ఆ వీడియో అప్పటికే సామాజిక మాధ్యమాల వేదికనెక్కి తెగ చక్కర్లు కొడుతోంది. (మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!)
అయితే గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి వైష్ణవ్ బుధవారం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సోమవారం నాటి సంఘటనలు జరగ కూడదు తప్పును అంగీకరిస్తున్నాను అంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడి ఉండాల్సింది, పొరబడ్డాను అంటూ జస్టిస్ వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా 2016, జనవరిలో సుప్రీంకోర్టులో దాదాపు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఎంవై ఎక్బాల్ , అరుణ్ మిశ్రా మధ్య జరిగిన వాగ్వాదానికి విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’)
Comments
Please login to add a commentAdd a comment