దేశంలో స్కైడైవింగ్ లైసెన్స్ పోందిన నాల్గవ మహిళ శ్వేత పర్మార్
దూకు... దూకేయ్... ఎక్కణ్ణుంచి. నింగి నుంచి నేలకు.మధ్యలో నువ్వో పక్షివవుతావు. నీ భుజాలు రెక్కలవుతాయి. దేహం దూదిపింజలా గిరికీలు కొడుతుంది. ఒక్కటే జీవితం.అద్భుతమైన అనుభవాలను ఎన్ని వీలైతే అన్ని మూట గట్టుకో. భారతదేశంలో లైసెన్స్‌డ్ ఉమెన్ స్కైడైవర్లు ఇప్పటి వరకు కేవలం ముగ్గురే ఉన్నారు. తాజాగా గుజరాత్ నుంచి ఏకైక మహిళగా శ్వేతా పర్మార్ నింగి గాలిని శ్వాసించింది. అయితే అందుకు ఆమె పట్టిన పంతం మాత్రం బుగ్గన వేలు ఆన్చి చదవదగ్గది.
మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలో స్కైడైవింగ్ సైన్యంలో ఉన్నవారికీ సైన్య శిక్షణ పొందగలిగిన వారికి మాత్రమే వస్తుంది. సాధారణ పౌరులు భారతదేశంలో ఎక్కడా స్కైడైవింగ్ నేర్చుకోలేరు. విదేశాలకు వెళ్లాల్సిందే. సాధారణంగా 7 వేల అడుగుల నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి స్కైడైవ్ చేస్తారు. కొన్నిక్షణాల ఫ్రీఫాల్ ఉంటుంది ఇందులో. ఆ తర్వాత పారాచూట్ ఓపెన్ చేసుకుని నేలకు దిగుతారు.
స్కైడైవింగ్ అంటే ప్రాణాలతో చెలగాటం. అంతా సవ్యంగా గడిచి నేలకు దిగే సమయంలో ఆ వేగం అదుపులో లేకపోయినా నేలకు ఢీకొని మరణించే సందర్భాలు ఉంటాయి. అందుకని మన దేశంలో సాధారణపౌరులు ఈ క్రీడలో దిగడం తక్కువ. స్త్రీలు ఆ సాహసానికి పూనుకోవడం ఇంకా తక్కువ. గతంలో స్కైడైవింగ్ నేర్చుకున్న భారతీయ వనితలు (సాధారణ పౌరులు) ముగ్గురు ఉన్నారు. రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దానా. ఇప్పుడు నాలుగో వనిత వారి సరసన చేరింది. గుజరాత్ వడోదరాకు చెందిన 28 ఏళ్ల శ్వేతా పర్మార్.
ఖరీదైన కల
కల కనడమే తెలిసినవారికి దాని సాధ్యాసాధ్యాలు తెలియవు. సాధించాలనుకునేవారికి అడ్డుకట్టలు పడలేవు. శ్వేతా పర్మార్‌కు స్కైడైవింగ్ చేయాలని కోరిక. ఆకాశంలో మనం కూడా పక్షిలాగా ఎగిరితే ఎలా ఉంటుంది. ఆ అదృష్టం ఎలా సాధ్యం అవుతుంది... ఇవే ఆలోచనలు. కాని ఆ కలను నెరవేర్చుకునేంత వీలు ఉన్న కుటుంబం కాదు ఆమెది. 18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయారు. ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్లు కొంత డబ్బు కడితే, స్కాలర్‌షిప్‌లు వస్తే బరోడా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేసింది.
ఆ తర్వాత తమ్ముడితో కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. కొద్దిగా డబ్బులు రాగానే 2016లో శ్వేత చేసిన మొదటి పని గుజరాత్‌లోని మెహసనా పట్టణంలో ఫ్లయింగ్ క్లబ్ ఉంటే అక్కడ ‘టాండమ్ జంప్’ చేయడం. అంటే పైలెట్ ఇన్‌స్ట్రక్టర్ మనల్ని తనతో పాటు కట్టుకుని స్కైడైవ్ చేస్తాడు. ఇందుకు ఆమెకు 35 వేల రూపాయలు ఖర్చయ్యింది. కాని ఆ టాండమ్ జంప్‌కే ఆమెకు స్కైడైవింగ్ మీద చాలా ఆకర్షణ ఏర్పడింది. నేనొక్కదాన్నే ఎగరాలి అనుకుందామె.
స్పెయిన్‌కు వెళ్లి
మొదలెట్టిన బిజినెస్‌ని తమ్ముడికి అప్పజెప్పేసి పూర్తిస్థాయి శిక్షణ కోసం 2018లో స్పెయిన్‌కు వెళ్లింది శ్వేతా పర్మార్. ‘అక్కడ ప్రతి జంప్‌కు నాకు 20 వేల రూపాయలు ఖర్చయ్యేది. అది కాకుండా ఉండటానికి, తిండికి. శిక్షణ కూడా చాలా శ్రమతో ఉంటుంది. గాలిలో నుంచి నేలకు దూకే వేగాన్ని తట్టుకోవడానికి కండరాలు తర్ఫీదు అవడం కోసం చాలా శిక్షణ ఇస్తారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్యారాచూట్ నేలకు తాకే సమయంలో వేగం అటూ ఇటూ అయితే ఎముకలు విరుగుతాయి. ఒకసారి అలాగే నాకు మైనర్ ఫ్రాక్చర్ అయ్యింది. అయినా విజయవంతంగా నేను శిక్షణ పూర్తి చేసుకున్నాను’ అంది శ్వేతా.
సర్టిఫికేట్ పొందాలి
స్కైడైవింగ్‌కు సర్టిఫికెట్ కావాలి. యునైటెట్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ (యు.ఎస్.పి.ఏ) రాత పరీక్షలో పాసై, తగినన్ని సార్లు స్కైడైవింగ్ అనుభవాన్ని నమోదు చేసి ఈ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. శ్వేత ఇందుకోసం 8 అంచెల కోర్సును, 29సార్లు స్కైడైవింగ్‌ను చేసి, రాత పరీక్ష రాసి సర్టిఫికెట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ నాలుగో మహిళ శ్వేత. ఆమెకు ఇది వరకే ఈ సర్టిఫికెట్ అందాల్సి ఉన్నా కోవిడ్ వల్ల ఆలస్యమై ఇటీవల ఆమె చేతికి వచ్చింది. స్పెయిన్ తర్వాత శ్వేత రష్యాలో, దుబాయ్‌లో స్కైడైవ్ చేసింది. ‘ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడైనా స్కైడైవింగ్ చేయవచ్చు’ అని సంతోషంగా అంది శ్వేతా.
‘నేను ఇప్పుడు యువతకు స్ఫూర్తినిస్తున్నాను. నన్ను చూసి స్కైడైవింగ్‌పై ఆసక్తి కనిపిస్తున్నారు చాలామంది. గుజరాత్ నర్మదా నదిలో (సర్దార్ పటేల్ విగ్రహం వద్ద) రివర్ రాఫ్టింగ్ లాంటి సాహస క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. కాని స్కైడైవింగ్‌ను ప్రోత్సహిస్తే టూరిజం అట్రాక్షన్ ఉంటుంది. ఆకాశం నుంచి కిందకు జంప్ చేయడంలో ఉంటే గొప్ప అనుభూతి మరే క్రీడలోనూ ఉండదు. జీవితం ఒక్కటే. ఆ అనుభూతీ ఒక్కటే’ అంది శ్వేతా పర్మార్. కొందరలా ఉంటారు... సాహసం శ్వాసగా సాగిపోతూ.
Comments
Please login to add a commentAdd a comment