ప్రేమికులకు వాలెంటైన్ వీక్‌లోని ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనదే. ఫిబ్రవరి 12ను వాలెంటైన్ వీక్‌లో ‘హగ్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు మాత్రమే కాదు.. ఆప్యాయతను అందుకునేవారంతా తమకు ఇష్టమైనవారిని కౌగిలించుకోవాలని, తమ మనసులోని భావాలను వారితో పంచుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ కౌగిలింతతో వచ్చే లాభాలేమితో ఇప్పడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఒక వైపు పని భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, దీనికితోడు ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అలాంటి సమయంలో కౌగిలింత (హగ్) అనేది ఒక అద్భుత వరమని, అది ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి మాయం
కావలించుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు సన్నిహితులను కావలించుకుంటే మనసుకు ఓదార్పు లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందుకే మీరు పార్ట్‌నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు మీ ఆప్యాయమైన కౌగిలింత అందించి, వారి ఒత్తిడిని దూరం చేయడంతోపాటు మీలోని ఒత్తిడిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
బరువు తగ్గడంలోనూ..
బరువు పెరగడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. టెన్షన్, పని ఒత్తిడి రోజూ అందరికీ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో కొందరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత వారిలోని ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. తద్వారా వచ్చే రిలాక్సేషన్ బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటుకు వైద్యం
మనకు ఆప్యాయతను అందించేవారిని 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మనలోని ఒత్తిడి తగ్గి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అందుకే బీపీ కంట్రోల్‌లో ఉండాలనుకుంటే ఆత్మీయులను కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పసివాళ్లను హగ్ చేసుకుంటే..
అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తన దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి అప్పటి వరకూ పడిన నొప్పులన్నింటినీ మరచిపోతుంది. అలాగే తల్లి కౌగిలింత పిల్లలకు సురక్షితంగా ఉన్నామనే భరోసానిస్తుంది. అది వారు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహద పడుతుంది. ఇదేవిధంగా పసివాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎవరికైనా సరే మనసుకు స్వాంతన లభిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment