చండీగఢ్: కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మయదారి మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపిన ఓ వ్యక్తి అదే కోవిడ్ సోకి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు.. 44 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. కరోనా వైరస్ రోగుల మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బృందానికి ప్రవీణ్ అధిపతి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి కోవిడ్‌తో మృత్యువాతపడిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమానం, భయం లేకుండాఇలా దాదాపు 300కుపైగా జరిపాడు.
ఈ క్రమంలో ఇటీవల ప్రవీణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రవీణ్ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సోకిన రెండు రోజులకే ఆయన సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఎంతో మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ ఇలా మరణించడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్‌లో మంగళవారం జరిపారు. ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment