
అసలే తాచుపాము. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ పాము రోడ్డు దాటుతోంది. ఇంతలో పామును పట్టుకొని, ఓ తాగుబోతు విన్యాసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నవరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి జాంబగుడ వద్ద జాతీయ రహదారిపైకి శుక్రవారం తాచుపాము వచ్చింది. ఎటువెళ్లాలో తెలియక రోడ్డు మధ్య భయంతో బుసలు కొడుతోంది. గమనించిన వాహనదారులు ప్రాణభయంతో దూరంగానే ఉండిపోయారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన మాధవ గౌడ మద్యం మత్తులో అక్కడకు చేరాడు. వెంటనే పాముని పట్టుకున్నాడు. తాగిన మైకంలో విన్యాసాలు ప్రారంభించాడు.
హద్దు మీరి ముద్దు పెట్టడంతో పాము మరింత కోపంతో అతని నోటిపై కాటు వేసింది. ఇది చూసిన జనం ఆందోళనతో పామును వదలమని కేకలు వేశారు. మరికొందరు పాముని వదిలితే డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు విసిరారు. కానీ.. ఎవరూ అతని వద్దకు వెళ్లేందుకు సాహసించలేదు. కొంతసేపటికి అతని నోటి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. చివరకు పాముని వదలినా, దాని వెంట పడటం ప్రారంభించాడు. మళ్లీ పాము పడగ ఎత్తి, పలుమార్లు కాలిపై కాటువేసి, అడవిలోకి పారిపోయింది. వెంటనే వాహనదారులు అంబులైన్స్ సమాయంతో మాధవ్‌ను నవరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..