సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న పండుగ సీజన్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. భగవంతుడి పట్ల, మతం పట్ల మీ విశ్వాసం నిరూపించుకునేందుకు పెద్దసంఖ్యలో ఒకేచోట గుమికూడాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో మనం ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు లక్ష్యంపైనే గురిపెట్టాలని, ఈ వైరస్‌ను తుదముట్టించి మానవత్వాన్ని కాపాడటమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. ఇదే మన మతమని, ప్రపంచ అభిమతమూ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.
అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ రీతిలో స్పందించాలని అన్నారు. ప్రార్థనలు చేసేందుకు మీరు విధిగా ఆలయాలు, మసీదులు సందర్శించాలని ఏ దేవుడూ, మతం చెప్పలేదని పేర్కొన్నారు. పండుగలు జరుపుకునేందుకు మన జీవితాలను పణంగా పెడతామా అని మంత్రి ప్రశ్నించారు. ‘ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతోంది..భారత్ ఈ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తోంది..ఈ పోరాటంలో జన్ ఆందోళన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చార’ని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం నిర్ధేశించిన భౌతిక దూరం నిబంధలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 70 లక్షలు దాటాయి. 60 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా లక్ష మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వైరస్ విజృంభణ, 70 లక్షలు దాటిన కేసులు
Comments
Please login to add a commentAdd a comment