
అసలే ఎండాకాలం.. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. మనుషులం.. మనమే ఎండవేడికి తాళలేకపోతున్నాం. ఇక నోరులేని జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక బాలుడు మాత్రం ఓ పక్షి దాహార్తి తీర్చి మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒక పిల్లవాడు తన ఇంటి బాల్కనీ పక్కన ఒక పావురాన్ని చూశాడు. చాలాసేపటి నుంచి అది ఎటు కదలకుండా అలాగే ఉండిపోయింది. పైగా అది చాలా నీరసంగా కనిపించింది. ఇది చూసిన ఆ బాలుడు చలించిపోయాడు.
పాపం.. ఎంత దూరం నుంచి ఎగురుతుందో, ఆ పక్షికి కాసిన్ని నీళ్లు ఇద్దాం అనుకున్నాడు. అలా ఒక చిన్న స్పూన్‌ను నీటితో నింపి ఇనుప చువ్వల సందులో నుంచి పావురం ముందు పెట్టాడు. మొదట పావురం నీరు తాగడానికి తటపటాయించింది. దీంతో బాలుడు కొంత నీరు కింద పోశాడు. ఆ వెంటనే పావురం గాబరాగా ఆ నీరు తాగటం మొదలుపెట్టింది. కాసేపటికి చెంచాలో ఉన్న నీళ్లన్నీ తాగి తన దాహార్తిని తీర్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్‌లో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ బాలుడు చేసిన పనికి ‘హ్యట్సాఫ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment