ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో పరిసర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి సరిహద్దుగా ఉన్న హర్యానా, పంజాబ్‌లు హై అలర్ట్ ప్రకటించాయి. సోన్‌పట్, పాల్వాల్, ఝజ్జర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్‌నెట్, ఎస్‌ఎంఎస్ సర్వీస్‌లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
అనూహ్యంగా రైతుల పరేడ్ విజయవంతం కావడంతోపాటు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో ఢిల్లీలో ఏం జరుగుతోందనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్లే అన్ని రహదారులు, మెట్రోస్టేషన్లు మూసివేశారు. ఈ సందర్భంగా ఢిల్లీకి అదనంగా పారామిలటరీ బలగాలను పెంచారు. ఇంటర్నెట్, మెట్రో సేవలను నిలిపివేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ పెంచారు. రైతుల పరేడ్‌కు కేంద్రంగా నిలిచిన ఎర్రకోట, జమా మసీద్ వద్ద పోలీసులు భద్రత పటిష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు తీసుకున్నారు. కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కొనసాగుతోంది.
దర్యాప్తు మొదలు
రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల దీక్షా శిబిరాల వద్ద భద్రత పెంచారు. అయితే నిన్నటి ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ ఘటనలపై చర్యలు మొదలుపెట్టారు. నిన్న జరిగిన ఘర్షణల్లో 153 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు పోలీసులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. నిన్నటి ఆందోళనలపై మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు గణతంత్ర పరేడ్‌పై స్పెషల్ సెల్ విచారణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా గ్యాంగ్‌స్టర్ల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘాజీపూర్‌మార్కెట్ నుంచి ఢిల్లీ వచ్చే రహదారి మూసివేశారు.
ఇది ఇలా ఉండగా రైతుల గణతంత్ర పరేడ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు వేరే శక్తులు కారణమని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయని.. రైతులెవరూ అలాంటి పరిణామాలకు అంగీకరించరని.. సహకరించరని గుర్తుచేశారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment