పెట్రోల్, డీజిల్‌ ధరలు; ఎవరి వాటా ఎంత?  | High Share of excise duty on petrol and diesel goes to central govt | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌ ధరలు; ఎవరి వాటా ఎంత? 

Published Wed, Dec 1 2021 4:40 AM | Last Updated on Wed, Dec 1 2021 8:46 AM

High Share of excise duty on petrol and diesel goes to central govt - Sakshi

నిజానికి కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్‌లపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో వస్తున్న ఆదాయం ఎంత?

కేంద్ర ప్రభుత్వం ఈనెల 3వ తేదీన పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. వెనువెంటనే అదేరోజు రాత్రి కూడబలుక్కున్నట్లుగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర రాష్ట్రాలూ తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. పెట్రో ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయింది కేంద్రమే కాబట్టి... మరింత ఉపశమనం కూడా కేంద్రమే ఇవ్వాలని తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు వాదించాయి. రాష్ట్రాల ఆదాయవనరులు పరిమితం... అసలే కోవిడ్‌ సంక్షోభ సమయం కాబట్టి తాము తగ్గించలేమని అశక్తతను వ్యక్తం చేశాయి.

నిజానికి కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్‌లపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో వస్తున్న ఆదాయం ఎంత? అందులో రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఎంత? ఇస్తున్నదెంత? అనే విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి మంగళవారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది. మొత్తం 3.72 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కారణం కేంద్రం పన్నులు భారీగా పెంచడమే.


15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా 41 శాతం. అంటే ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాల వాటా (41 శాతం లెక్కన) కింద కేంద్రం రూ. 1,52,520 కోట్ల రూపాయలను చెల్లించాలి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఈ 41 శాతం పన్నుల వాటాలో ఏ రాష్ట్రానికి ఎంతివ్వాలనేది ఫైనాన్స్‌ కమిషన్‌ (జనాభా దామాషా పద్ధతిన) నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం రాష్ట్రాలకు ఎక్సైజ్‌ డ్యూటీలో తమ వాటా అందుతుంది. కానీ 2020–21 ఆర్థికానికి 1.52.520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచాల్సిన కేంద్ర ఇచ్చిందెంతో తెలుసా? రూ. 19,972 కోట్లు మాత్రమే. అంటే 2020–21లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాలో ఏకంగా 1,32,548 కోట్లను కేంద్రం తమ బొక్కసంలో వేసేసుకుంది. ఎందుకిలా? సమాఖ్య వ్యవస్థలో కేంద్ర సర్కారు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన న్యాయమైన వాటాను ఎలా తగ్గించగలదు? అనే కదా మీ సందేహం? 


అసలు మతలబు ఇదీ... 
కేంద్ర ప్రభుత్వ పెట్రోల్, డీజిల్‌లపై వసూలు చేసే పన్నును ఎక్సైజ్‌ డ్యూటీ పద్దు కింద నేరుగా వసూలు చేస్తే... రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా దక్కుతుంది. ఇక్కడే కేంద్రం మతలబు చేస్తోంది. ఎక్సైజ్‌ డ్యూటీ పద్దు కింద నామమాత్రంగా చూపి... మిగతా పన్నును అంతా వివిధ సెస్సుల రూపంలో చూపెడుతోంది. బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ మాత్రమే డివైజిబుల్‌ పూల్‌ (రాష్ట్రాలతో పంచుకునేది) కిందకు వస్తుంది. ఈ పద్దు కింద చూపే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సెస్సుల రూపంలో వచ్చే దాంట్లో పైసా కూడా రాష్ట్రాలకు దక్కదు. గంపగుత్తగా వచ్చినదంతా కేంద్ర ఖజానాను వెళుతుంది. అదెలాగో ఈ రెండు పట్టికల్లో చూద్దాం. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన తర్వాత ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులో ఏ పద్దు కింద ఎంత రాబడుతుందో చూద్దాం. 
 – నేషనల్‌ డెస్క్, సాక్షి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement