సిమ్లా: ఎన్నికల ముందర హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి రెబల్స్ తలనొప్పులు వచ్చి పడ్డాయ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలను, ఓ మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించి ఒక్కరోజు గడవక ముందే ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కులు అసెంబ్లీ సీటుకుగానూ పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థి నరోత్తమ్ థాకూర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రామ్ సింగ్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు రామ్ సింగ్‌కు ఉన్న పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కశ్యప్ ప్రకటించారు.
అంతకు ముందు మరో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్ సైతం ఇలాగే స్వతంత్ర అభ్యర్థిగా కులు నుంచి పోటీకి దిగాలని అనుకున్నారు. అయితే.. పార్టీ నేతల జోక్యంతో ఆయన వెనక్కి తగ్గారు. జై రాం థాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లో కొలువు దీరాక.. రామ్ సింగ్‌కు ఆ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ నిరాకరణతో.. రెబల్‌గా మారిపోయారు.
అధికార బీజేపీ తరపున ఈసారి ఎన్నికల్లో కేబినెట్ మంత్రితో సహా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. దీంతో పార్టీలో తిరుగుబాటు మొదలైంది. క్షేత్ర స్థాయి కార్యకర్తలు మొదలు.. కీలక నేతల దాకా బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీళ్లలో కొందరు పార్టీలు మారగా.. మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే.. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న పోలింగ్ నిర్వహిస్తామని, ఒకే దశలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని, డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment