టిడిపికి రెబల్స్ బెడద
హైదరాబాద్: ఎన్నికలు వచ్చాయంటే అన్ని పార్టీలలో నేతల వలసలు, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేయడం మామూలే. ఈ సారి తెలుగుదేశం పార్టీకి ఆ బెడద ఎక్కువైంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, అందులోనూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారు. దానికితోడు బిజెపితో పొత్తు వల్ల సీమాంధ్రలో టిడిపికి బాగా దెబ్బతగిలింది. పలువురు నాయకులు పార్టీని వీడితే, మరికొందరు రెబల్స్గా నామినేషన్లు వేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇంకొందరు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి జిల్లాలలోనూ టిడిపికి ఇటువంటి సమస్య ఉంది.
విశాఖపట్నం జిల్లా గాజువాకలో హర్షవర్ధన్, భీమిలిలో అనిత సక్రు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. మరికొన్ని జిల్లాలలో కూడా ఈ రకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి వారికి నచ్చజెప్పడం చంద్రబాబు నాయుడుకు ఒక ప్రధాన అంశంగా ఉంటోంది. టీడీపీ రెబల్ అభ్యర్ధిగా గాజువాక నుంచి పోటీ చేస్తానని హర్షవర్ధన్ చెప్పారు. 30 ఏళ్లు పార్టీకి సేవ చేసినా కొత్తగా వచ్చినవారికి టికెట్లు ఎలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
అనకాపల్లి టీడీపీలో కూడా విబేధాలు తలెత్తాయి. నామినేషన్ వేస్తున్న సందర్భంగా తన ఇంటికొచ్చిన అవంతి శ్రీనివాస్‌ను బయటికి వెళ్లిపోవాలని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎందుకు వచ్చావంటూ అవంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బిక్కమొహంతో అవంతి శ్రీనివాస్ వెళ్లిపోయారు. బీజేపీతో పొత్తుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీడీపీ కార్యకర్తలు ఈ రోజు రోడ్డుపై బైఠాయించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.
నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో స్థానిక టిడిపి నేతలు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శాసనసభ స్థానం బిజెపికి కేటాయించిన విషయమై టీడీపీ రాయలసీమ బాధ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.