సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌లో ముసలం ఇంకా ముగియలేదనే సంకేతాలు అందుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలకు మరికొందరు తోడవుతున్నట్లు సమాచారం. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్త పడింది. ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశాలు పూర్తిగా పోయేంతవరకు అప్రమత్తత అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను రంగంలోకి దించింది. .
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా హర్యానా(బీజేపీ పాలిత రాష్ట్రం) పంచకుల్లాలో మకాం వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు వాళ్లంతా. ఈ క్రమంలో.. ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆ ఆరుగురిని కలవడం అక్కడి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసింది.
మాజీ ముఖ్యమంత్రి అయిన విదర్భ సింగ్(దివంగత) కుమారుడు విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో విక్రమాదిత్య క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోయినప్పటికీ.. అదేరోజు భావోద్వేగపూరితంగా మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని కాంగ్రెస్ తీవ్రంగా అవమానిస్తోందని చెబుతూనే.. బీజేపీతో పోరాటే శక్తి కాంగ్రెస్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పార్టీకి, పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే హైకమాండ్ జోక్యంతో సాయంత్రానికి ఆయన చల్లబడ్డారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తాను పార్టీని వీడొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇక.. ఈ ఉదయం రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన విక్రమాదిత్య.. మార్గం మధ్యలో ఆ ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ పర్యటన ముగిశాక తిరుగు ప్రయాణంలోనూ ఆయన మరోసారి వాళ్లతో భేటీ అవుతారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఆరుగురు రెబల్స్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగకమునుపే.. విక్రమాదిత్యను సీన్‌లోకి దించి మంతనాలు జరిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
అవునా.. నాకు తెలియదు!
ఇదిలా ఉంటే.. రెబల్స్‌ను విక్రమాదిత్యసింగ్ కలిసినట్లు వస్తున్న వార్తలపై ఆయన తల్లి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడి పర్యటన షెడ్యూల్ వివరాలు తనకి తెలియవని అన్నారు. గత రాత్రి తను(విక్రమాదిత్య) ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని అంటున్నారామె. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలను మాత్రం హైకమాండ్‌కు తాము నివేదిస్తామని చెప్పారామె.
ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉంటోంది వీరభద్ర సింగ్ కుటుంబం. తాజా సంక్షోభం నేపథ్యంలో.. మరోసారి ఆ డిమాండ్‌నే అధిష్టానం వద్ద ఉంచినట్లు వినవస్తోంది. అయితే సుఖ్విందర్ సింగ్ సుఖు మాత్రం తాను ఫైటర్‌ని అని.. తానే ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని ప్రకటించుకుంటున్నారు.
ఆ ఆరుగురికి కాంగ్రెస్ ఆఫర్
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్‌తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే.. అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment