
న్యూఢిల్లీ: ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. అయితే.. ఆయా రాష్ట్రాల్లో మరింత వర్షం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది.
హిమాచల్ అస్తవ్యస్తం
హిమాచల్ ప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సిమ్లా జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, కులు, చంబా జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. గత 36 గంటల్లో 14 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు, 13 ఆకస్మిక వరదల ఘటనలు నమోదయ్యాయి. వరదలతో కొట్టుకుపోయిన 700 రోడ్లను మూసివేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ స్పిటిలోని చంద్రతాల్‌లో 200 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. బియాస్ వరదల్లో చండీగఢ్–మనాలి హైవేలోని కొంతభాగం కొట్టుకుపోయింది. మనాలి, కిన్నౌర్, చంబాల్లో వరదల్లో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి.
ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్..
ఉత్తరాఖండ్‌లో ముగ్గురు గల్లంతు
ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళ్తున్న జీపు రిషికేశ్–బద్రీనాథ్ నేషనల్ హైవేపై గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని యంత్రాంగం తెలిపింది.
కశ్మీర్‌లో ఇద్దరు జవాన్ల దుర్మరణం
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఇదీ చదవండి: ఉప్పొంగిన బియాస్ నది.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment