మంగళవారం(07-03-2023)రంగుల కేళి హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నేటి ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు హోలీని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఎన్నిరోజులు జరుపుకొంటారు? హోలికా దహనం ఎందుకు చేస్తారు? ఈ ఏడాది ఏ మూహుర్తంలో పూజలు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, రాధా కృష్ణల ప్రేమకు గుర్తుగా హోలీ జరుపుకొంటారు. ఈ పండుగను రెండు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు చోటీ హోలి. అంటే హోలికా దహనం. రెండో రోజు రంగుల హోలి. అంటే ఒకరిపైఒకరు రంగులు జల్లుకొని పండుగ చేసుకోవడం. ఈ ఏడాది చోటి హోలి (హోలికా దహన్) మార్చి 7న, బడీ హోలి(రంగుల హోలి)మార్చి 8న జరపుకోవాలని ప్రముఖ పంచాంగం వెబ్‌సైట్ డ్రిక్ పంచాగ్ తెలిపింది.
హోలికా దహనం ఏ సమయంలో..
హోలికా దహనాన్ని మార్చి 7న(మంగళవారం) సాయంత్రం 6:24 గంటల నుంచి రాత్రి 8:51 గంటల మధ్యే జరుపుకోవాలి. అయితే పౌర్ణమి తిథి మార్చి 6(సోమవారం) సాయంత్రం 4:17కు ప్రారంభమై, మార్చి 7( మంగళవారం) సాయంత్రం 6:09 గంటలకు ముగుస్తుంది. హోలికా దహనం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగిస్తారు. తెలుగురాష్ట్రాల ప్రజలు ఈ పూజను సాయంత్రం 6:24 నుంచి రాత్రి 08:49 మధ్య జరుపుకోవాలని పండితులు చెప్పారు.
ఎందుకీ పండుగ?
హిందూ పురాణాల ప్రకారం హోలికా దహనం ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. ఎందుకుంటే అతడు విష్ణువును ఆరాధించడం హిరణ్యకశ్యపుడికి అసలు నచ్చదు. దీంతో ఎన్నోసార్లు ప్రాహ్లాదుడ్ని చంపే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. విష్ణువు అతడ్ని కాపాడుతుంటాడు.
అయితే ప్రహ్లాదుడ్ని చంపేందుకు హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా సాయం చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలిసి పథకం పన్నుతారు. దీని ప్రకారం హోలికా మంటల్లో కూర్చుంటే.. ప్రహ్లాదుడ్ని ఆమె ఒడిలో కూర్చోమని హిరణ్యకశ్యపుడు ఆదేశిస్తాడు. తండ్రిమాట ప్రకారం ప్రహ్లాదుడు వెళ్లి మంటల్లోనే హోలికా ఒడిలో కూర్చుంటాడు. కాపాడమని విష్ణువును ప్రార్థిస్తాడు. దీంతో విష్ణువే ప్రహ్లాదుడ్ని మంటల్లో కాలిపోకుండా చేస్తాడు. హోలికా మాత్రం అదే మంటల్లో కాలిబూడిదవుతుంది. దీంతో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలికా దహనం చేసి, ఆ మరునాడు హోలి పండుగను ఘనంగా జరుపుకొంటారు.
అలాగే ఈ పండుగను శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు , రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుటుందని, అందుకే ఈ రోజును రంగుల పండుగగా జరుపుకుంటారని ప్రజలు విశ్వసిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment