బెంగుళూరు : భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఫేస్‌బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇస్రోలో కలకలం రేపుతున్నాయి. 2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనను చంపేందుకు కుట్ర జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ‘సుదీర్ఘ కాలం దాచి ఉంచిన రహస్యం’ పేరిట ఫేస్‌బుక్‌లో మిశ్రా చేసిన పోస్టు సంచలనం రేకెత్తిస్తుంది. ఆరోజు తాను తీసుకున్న దోశ, చట్నీలో విషపూరిత రసాయనాన్ని కలిపారని తెలిపారు. ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డానని, చర్మంపై ఆసాధారణ దద్దుర్లు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని చెప్పారు. (ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు )
గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఓ ప్రముఖ రాడార్ ఆధారిత ప్రాజెక్టుకు సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న నన్ను తొలిగించేందుకే ఈ దాడి చేసి ఉంటారని తెలిపారు. ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని, ఓ సహోద్యోగి కూడా దీనిపై ముందే తనను అలర్ట్ చేసినట్లు మిశ్రా అన్నారు. వీరి వల్లే వైద్యులకు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విష ప్రయోగం జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాను చనిపోయి ఉండేవాడినని చెప్పారు. ఈ చీకటి నిజాన్ని బయటికి బహిర్గతం చేయవద్దంటూ ఇప్పటికీ తనకు వందలాది మెయిల్స్ వస్తున్నాయని మిశ్రా అన్నారు.
అంతేకాకుండా గత రెండేళ్లుగా తాను ఉంటున్న క్వార్టర్స్‌లోకి క్రమం తప్పకుండా కోబ్రా, క్రైట్ వంటి విషపూరిత పాములు కనిపించాయని చెప్పరు. సెక్యురిటీ సిబ్బంది వల్ల అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఇప్పటికీ ఈ విషయం బయటకు రాకుండా కొందరు బెదిరింపులకు దిగుతున్నారని, మానసిక వికలాంగుడైన తన కుమారుడిని లక్క్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.జూలై 19, 2019న యుఎస్ విశ్వవిద్యాలయంలోని ప్రవాస ప్రొఫెసర్ కూడా క్విట్ ప్రోకో పద్ధతికి తనతో బేరం ఆడాడని, ఈ విషయం బయటకు రాకుండా చూస్తే తన కుమారుడికి ఓ ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ కూడా ఇప్పిస్తానని మభ్యపెట్టాడని ఆరోపించారు. అయితే వీటికీ తాను బెదరలేదుని, గతేడాది సెప్టెంబర్‌లోనూ తనపై మరోసారి విష ప్రయోగం చేయాలని విఫలయత్నం చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికైనా కేంద్రం దర్యాప్తు చేయాల్సిందిగా తపన్ మిశ్రా అభ్యర్థించారు. గత కొన్నాళ్లుగా డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేదని, దీని వెనుక దాగున్న కుట్రదారులెవరో ప్రభుత్వమే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని విఙ్ఞన్తి చేశారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్ మిశశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. జనవరి చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే కాగా తపన్ మిశ్రా ఆరోపణలపై ఇస్రో ఇంకా స్పందించలేదు. (దేశంలో కొత్త విపత్తు )
Comments
Please login to add a commentAdd a comment