మొట్టమొదటిసారి టాప్–100లో భారత సంస్థ
సాక్షి, ఎడ్యుకేషన్: అంతర్జాతీయంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులను ప్రకటించే ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ జాబితాలో మొట్టమొదటిసారి భారత్‌కు చెందిన ఓ విద్యా సంస్థ టాప్–100లో చోటు సాధించింది. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ – బెంగళూరు) 96వ ర్యాంకు సొంతం చేసుకొంది. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విభాగంలో సైతం 99వ ర్యాంకు సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా 11 వేల ఉన్నత విద్యా సంస్థల్లోని బోధన ప్రమాణాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా 2024 సంవత్సరానికి గత ఏడాది అక్టోబర్‌లో ర్యాంకులు కేటాయించగా.. తాజాగా 11 సబ్జెక్ట్ విభాగాల్లో సబ్జెక్ట్ వారీగా ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అగ్రస్థానం దక్కించుకుంది.
ఐఐఎస్‌సీ బెంగళూరు జోరు..
సబ్జెక్ట్ వారీ ర్యాంకుల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు జోరు కనిపించింది. ఈ సంస్థ 250 లోపు ర్యాంకు శ్రేణిలో నాలుగు సబ్జెక్ట్ విభాగాల్లో ర్యాంకులు సాధించింది. కంప్యూటర్ సైన్స్‌లో 96వ ర్యాంకు, ఇంజనీరింగ్‌లో 99వ ర్యాంకు, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్‌లోనూ 201–250 ర్యాంకుల శ్రేణిలో నిలిచింది. మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్‌లో సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్ 201–300 శ్రేణిలో ర్యాంకు పొందింది.
సైకాలజీలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 401–500 ర్యాంకుల్లో నిలిచింది. న్యాయ శాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ 301 ర్యాంకుల్లో బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో అమిటీ యూనివర్సిటీ 401 – 500 శ్రేణిలో, ఎడ్యుకేషన్ స్టడీస్‌లో ఢిల్లీ యూనివర్సిటీ 501–600 శ్రేణిలో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్‌లో ఢిల్లీ యూనివర్సిటీ 401–500 శ్రేణిలో, సోషల్ సైన్సెస్‌లో లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 251–300 శ్రేణిలో నిలిచాయి.
ఐఐటీలు.. 501పైగా ర్యాంకులతో..
మరోవైపు.. ఇంజనీరింగ్ విద్యకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు మాత్రం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విభాగంలో 501కి పైగా శ్రేణిలో నిలవడం గమనార్హం. ఐఐటీ గువహటి, ఇండోర్‌లు 501–600 శ్రేణిలో ఉన్నాయి. ఐఐటీ–పాట్నా 601–800; ఐఐటీ గాంధీనగర్, మండి, రోపార్‌లు 801–1000 ర్యాంకుల శ్రేణిలో నిలిచాయి.
కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాత్రం ఐఐటీ–ఇండోర్ 401–500 జాబితాలో చోటు సాధించింది. ఐఐటీ–పాట్నా 501–600, ఐఐటీ–గాంధీనగర్ 601 – 800, ఐఐటీ – గువహటి 801–1000 జాబితాలో నిలిచాయి. తొలి తరం ఐఐటీలుగా పిలిచే ఖరగ్‌పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, రూర్కీ, చెన్నైకి చోటే దక్కలేదు.
సబ్జెక్ట్ వారీగా టాప్–1 ఇన్‌స్టిట్యూట్స్
» కంప్యూటర్ సైన్స్ – యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
» ఫిజికల్ సైన్సెస్ – కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
» లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్‌లలో – హార్వర్డ్ యూనివర్సిటీ
» సైకాలజీ, న్యాయ శాస్త్రం – స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
» బిజినెస్ ఎకనామిక్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ – మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
» ఎడ్యుకేషన్ స్టడీస్ – యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
ప్రామాణికంగా అయిదు అంశాలు
ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు కేటాయించడంలో టీచింగ్, రీసెర్చ్ ఎన్విరాన్‌మెంట్, రీసెర్చ్ క్వాలిటీ, ఇండస్ట్రీ ఔట్‌లుక్, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ అనే అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అంశాల్లో ఆయా విద్యా సంస్థల్లో నాణ్యత, నైపుణ్యం ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు. ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ రీసెర్చ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు.
ప్రామాణిక అంశాలపై భిన్నాభిప్రాయాలు
ర్యాంకుల నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకునే అంశాల విషయంలో ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వంటి ప్రామాణికాలు భారతీయ విద్యా సంస్థల పరిస్థితికి సరితూగేలా లేవని విద్యావేత్తలు అంటున్నారు.
ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికా, ఇంగ్లండ్‌లనే ఎంచుకుంటున్నారని, దీంతో ఈ విద్యార్థుల సంఖ్య భారతీయ విద్యా సంస్థల్లో తక్కువ ఉంటోందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ర్యాంకుల్లో ఇన్‌స్టిట్యూట్స్ వెనుకంజలో ఉంటున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment