సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
(షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు)
తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్‌దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు)
Comments
Please login to add a commentAdd a comment