Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ నేతలు అరెస్ట్‌ | Imran Khan Party PTI Top Leaders Arrested After Being Accused Of Inciting Violence, See Details | Sakshi
Sakshi News home page

Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ నేతలు అరెస్ట్‌

Published Tue, Sep 10 2024 11:50 AM | Last Updated on Tue, Sep 10 2024 1:04 PM

Imran Khan Party PTI Top Leaders Arrested

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐకి చెందిన పలువురు అగ్రనేతలను జాతీయ అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్లమెంట్‌ వెలుపల పోలీసులు అరెస్టు చేశారు. పలు మీడియా కథనాలలో ఇది ‍ప్రముఖంగా ప్రచురితమయ్యింది.

పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతలు బారిస్టర్ గౌహర్ అలీ ఖాన్, షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్, అడ్వకేట్ షోయబ్ షాహీన్‌లను ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి జావేద్ తాకీ తెలిపారని డాన్ పత్రిక పేర్కొంది. ఈ అరెస్టుకు స్పందిస్తూ పీటీఐ పార్టీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ‘నేషనల్‌ అసెంబ్లీలో సిట్టింగ్ సభ్యునిపై ఇటువంటి చర్య తీసుకున్నందుకు పీఎంఎల్‌ఎన్‌ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి.ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధమైన ఆదేశాలను పాటిస్తున్నారు. ఈ చర్యను ఆపాలి’ అని ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)ని కోరింది.

‘ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని అనుచరులకు ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో మరోసారి రుజువు  అయ్యింది’ అని మార్వాత్‌  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్ ఖాన్‌ ఈ అరెస్టులను ఖండించారు. ఇస్లామాబాద్ పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. నేషనల్‌ అసెంబ్లీలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్వాత్‌ను అరెస్టు చేసినట్లు సోర్సెస్ జియో న్యూస్‌కి తెలిపింది. పోలీసు సిబ్బందితో పీటీఐ ఎంపీ గొడవకు దిగారని ఆ మీడియా పేర్కొంది.

రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (71) పలు చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతి కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా పీటీఐ నేతలు ఒమర్, జర్తాజ్‌లతో పాటు హమ్మద్ అజర్, కన్వాల్ షౌజాబ్, నయీమ్ హైదర్ పంజుతా, అమీర్ మొఘల్, ఖలీద్ ఖుర్షీద్‌లతో సహా ఇతర పీటీఐ నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement