
న్యూఢిల్లీ: భారతీయులను వైవిధ్యం పట్ల సహజంగా ఉండే ప్రేమే శతాబ్దాలుగా ఐకమత్యంగా ఉంచుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌కున్న ఈ విశిష్టతే ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించిందని చెప్పారు. ‘భారతదేశం వివిధ వర్గాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలకు నెలవు. ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను ఆచరిస్తూనే ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.
ఒకరి పండుగలను మరొకరు జరుపుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు’అంటూ ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌కు చెందిన నజాకత్ చౌధరికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా చౌధరి ఇటీవల అస్సాంలో పర్యటించారు. ఈ పర్యటన తనలో స్ఫూర్తి నింపిందనీ, మరిచిపోని అనుభూతులను మిగిల్చిందంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ప్రధాని పైవిధంగా బదులిచ్చారు.
నేడు 71 వేల మందికి నియామక పత్రాలు
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మందికి మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో నియామక పత్రాలివ్వనున్నారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన ఇప్పటిదాకా 2.9 లక్షల మందికి నియామక పత్రాలిచ్చారని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను ఏర్పాటు చేయనున్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment