
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై పన్నులు తగ్గించి, సెస్సు రద్దు చేయాలి
జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో ప్రధాని మోదీకి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్లాబ్‌లో రద్దు లేదా మార్పు ద్వారా ప్రజలకు నిజమైన దీపావళి అందిస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రో «ఉత్పత్తుల ధరలు తగ్గించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగే జీఎస్‌టీ జాతీయ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో ప్రధానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
చేనేతపై జీఎస్‌టీ రద్దు చేయాలి
‘తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై పన్నులు ఉండకూడదని భావించాం. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై తొలుత 5శాతం విధించి ఆ తర్వాత 12శాతానికి పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్త వ్యతిరేకత వెల్లువెత్తడంతో 12శాతం పన్ను విధింపు నిర్ణయాన్ని వాయి దా వేశారు.
చేనేతపై పన్ను విధింపును విరమించుకోవాలి. జీఎస్‌టీలోనీ 12శాతం స్లాబ్ ను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజ లకు మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం జీఎస్టీ ద్వారా సమకూరే రూ.22 లక్షల కోట్లలో 12% స్లాబ్ వాటా కేవలం 5శాతం మాత్రమే. దశాబ్ద కాలంగా నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటోంది.
పెట్రో, ఎల్‌పీజీ ధరలను తగ్గించాలి
పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ ధరలను తగ్గిస్తే పరోక్షంగా ఇతర నిత్యావసరాల ధరల భారం కూడా తగ్గుతుంది. సెస్సుల రూపంలో రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బకొట్టే కుట్రకు పాల్పడిన కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ రేట్లను వెంటనే తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, విద్యకు సంబంధించిన ఫీజులు, కేన్సర్ చికిత్సకు అవసరమైన ఔషధాలపై విధిస్తున్న జీఎస్‌టీని పూర్తిగా ఎత్తివేయాలి’అని ప్రధానికి రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాయాలి: కేటీఆర్
మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్‌డ్యామ్ 2 నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సంగతిని పక్కన పెడితే ఒక్క ఇటుక ముక్క కూడా సరిగా పేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయ ని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చందానగర్ నగల దుకాణంలో దోపిడీ, కూకట్‌పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు.