ఎన్‌డీటీవీ ప్రపంచ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: అద్భుత ప్రగతి పథంలో దూసుకెళ్తూ ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఎన్‌డీటీవీ వరల్డ్ సదస్సులో ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేసి పలు అంశాలపై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
డబుల్ ఏఐ ప్రయోజనాలు
‘‘మూడోసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుతమైన ప్రతిపథంలో నడిపిస్తున్నాం. యుద్దాలు, సంక్షోభాలుసహా ప్రపంచాన్ని పలు సమస్యలు పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణంలా మారింది. రెండు ఏఐల అదనపు ప్రయోజనాలు భారత్‌సొంతం. ఒకటి ఆశావహ ఇండియా(ఏఐ), కాగా మరోకటి కృత్రిమమేథ(ఏఐ). ఈ రెండింటి కలయికతో భారత్ వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆపత్కాలాల్లో ప్రపంచం భారత్‌ను ఒక స్నేహితునిలా చూస్తుంది. కోవిడ్ మహమ్మారివేళ ఎన్నో దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరాచేసింది. ఏ దేశంతోనూ భారత్ బంధం గాలివాటంగా ఏర్పడలేదు.
ఎంతో నమ్మకం, సత్సంబంధాలతో బలోపేతమైంది. భారత్ బాగుపడితే అసూయపడే దేశాలు లేవు. ఎందుకంటే భారత దేశ అభివృద్ధి ఫలాలు ప్రపంచదేశాలకూ పనికొస్తాయని అందరికీ తెలుసు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైతే ప్రపంచమే సంబరాలు చేసుకుంది. చరిత్రలోకి తొంగిచూస్తే ప్రపంచఅభివృద్ధిలో భారతపాత్ర ఎనలేనిదని స్పష్టమవుతోంది. అయితే గత దశాబ్దాల్లో వలసపాలన కారణంగా ప్రపంచ పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 యుగం మొదలైంది. అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటోంది’’ అని అన్నారు.
డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్యవిలువల్ని మేళవించాం
‘‘ డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువల్ని సమ్మిళితం చేశాం. అలాంటి సాంకేతికతే సాధికారత, పారదర్శకతలకు పనిముట్టుగా మారుతుంది. సాంకేతిక దన్నుతో ఎదిగిన యూపీఐ, పీఎం గతి శక్తి, ఓఎన్‌డీసీ వంటివి ఇందుకు మేలిమి తార్కాణాలు. ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందడం మాత్రమేకాదు ఒక శక్తిగా అవతరిస్తోంది. పేదరికం వంటి సవాళ్లు ఉన్నాయని తెలుసు. త్వరితగతిన నూతన విధాననిర్ణయాలను అమలుచేస్తూ సంస్కరణలు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు.
ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారు
‘‘మానవాళి చరిత్రలో 21 శతాబ్దపు ఈ కాలం ఎంతో ముఖ్యమైంది. సమస్యలను పరిష్కరించుకుంటూనే సుస్థిరాభివృద్ధిని సాధించాలి. మానవాళికి మెరుగైన భవిష్యత్తు అవసరం. అందుకోసం భారత్ పాటుపడుతోంది. దేశంలో గత ఆరుదశాబ్దాల్లో తొలిసారిగా వరుసగా మూడుసార్లు ఒకే ప్రభుత్వానికి ప్రజలుపట్టంకట్టారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారని హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ రుజువుచేశాయి. మూడోదఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేం రూ.9 లక్షల కోట్ల విలువైన మౌలికవసతుల ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ 125 రోజుల్లో స్టాక్‌మార్కెట్ సైతం ఆరేడు శాతం వృద్ధిని చూపిస్తోంది’’ అని మోదీ అన్నారు. మోదీ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ సదస్సులో మాట్లాడారు. ‘‘ బ్రిటన్‌లో మార్గరేట్ థాచర్, టోనీ బ్లెయిర్ కాలం నుంచి చూసినా మా దేశంలో ఎవరూ మూడోసారి ప్రధాని కాలేదు. మీరు(మోదీ) మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు’’ అని కామెరూన్ పొగిడారు.
Comments
Please login to add a commentAdd a comment