సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌పై ఆందోళన నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా సర్వే కీలక విషయాలను వెల్లడించింది. సెకండ్ వేవ్ తీవ్ర ఉధృతి క్రమంగా క్షీణిస్తూ, కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పుంజుంటోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం కొత్తగా 40వేల లోపు కేసులు నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. అలాగే మరణాలు వెయ్యి లోపు నమోదైనాయి. దీంతో కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది.
అయితే మూడో వేవ్ ముప్పుమాత్రం దేశ ప్రజలను వెంటాడుతోంది. ఈ క్రమంలో థర్డ్‌వేవ్ ప్రభావంపై ఎస్‌బీఐ తాజా సర్వే కీలక అంచనాలు వెలువరించింది. వచ్చే నెలలోనే (ఆగస్ట్) కరోనా థర్డ్‌వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. ‘కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో ఎస్‌బీఐ ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, అలాగే ఆగస్ట్ 15 తరువాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.
ఎస్‌బీఐ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు
గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్ వేవ్‌తో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ సగటు ఉధృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చారిత్రక పోకడల ఆధారంగా ఆగస్ట్ 12 తరువాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని, నెల తరువాత పీక్ స్టేజీకి వెళ్లేఅవకాశం ఉంది. అలాగే దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తుండగా, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతంగా ఉన్నారు. ఇక తొలి డోసు తీసుకున్వారు 20.8 శాతం మంది మాత్రమే. యుఎస్, యుకె, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే ఇది ఇప్పటికీ తక్కువే.
మరోవైపు కరోనా నిబంధనలు పాటించకపోతే అక్టోబర్-నవంబర్ మధ్య థర్డ్‌వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానెల్ శాస్త్రవేత్త హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే రెండో వేవ్‌తో పోలీస్తే రోజువారీ కేసుల సంఖ్య సగానికి తగ్గవచ్చన్నారు. దేశంలో లక్షా, 50 వేలనుంచి 2 లక్షల వరకు కేసులు నమోదు కానున్నాయని ప్యానెల్ సభ్యులు, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త అగర్వాల్ హెచ్చరించారు. ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్త ఎం విద్యాసాగర్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment