
న్యూఢిల్లీ: ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా రక్షణ శాఖ ఆమోదించిన నేపథ్యంలో త్వరలోనే అమెరికా, భారత ఉన్నతాధికారులు తుది దశ చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో గగనతలంలో నిరంతర నిఘా, మెరుపు దాడుల కోసం ఈ డ్రోన్లను భారత్ వినియోగించనుంది. ఈ భారీ డ్రోన్ సరిహద్దులతోపాటు శత్రు దేశాల సైనిక వాహనాలపై నిఘాతోపాటు వాటిని వెంటాడి క్షిపణులతో దాడిచేయగలదు. ఏకబిగిన 35 గంటలపాటు గాల్లోనే ఉండగలదు. 450 కేజీల బరువైన బాంబులు అమర్చిన క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇంతటి అత్యాధునికమైన డ్రోన్లను త్రివిధ దళాల్లో దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత్ తలపోస్తోంది.
అందులోభాగంగానే ఈ డీల్ కుదుర్చుకుంటోంది. అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థ జనరల్ ఆటమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేస్తోంది. 31 డ్రోన్లకు మొత్తంగా రూ.25,000 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో డ్రోన్‌ను ఎంతకు కొనాలనే ధర, ఇతరత్రా విషయాలు ఇంకా ఖరారుకాలేదు. తుది చర్చల్లో వీటిపై నిర్ణయాలు తీసుకునే వీలుంది. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన తొలి అనుమతిని లోని రక్షణరంగ కొనుగోళ్ల మండలి ఆమోదించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment