జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో ఉపయోగించే కీలకమైన క్రయోజనిక్ దశ ఇంజన్ ఇదే
సూళ్లూరుపేట: ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో శనివారం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్‌సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది.
ఈ నెల 22న నిర్వహించిన ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్ ప్రయోగం ద్వారా లండన్ శాటిలైట్ కమ్యూనికేషన్ల సంస్థ ‘వన్‌వెబ్’కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్‌వెబ్‌కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది.
ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష్య తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనంలో 5 టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సీఈ–20 పేరిట నూతనంగా క్రయోజనిక్ ఇంజన్‌ను డిజైన్ చేశారు. సుమారు 25 సెకండ్లపాటు మండించి ఈ ఇంజన్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని ఎల్‌వీఎం3 రాకెట్ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్–2 రాకెట్ ప్రయోగాలకు సీఈ–12.5, జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాలకు సీఈ–25, వాణిజ్యపరంగా ఎల్‌వీఎం3 ప్రయోగాలకు సీఈ–20.. అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందుబాటులోకి రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment