![IT Minister Rajeev Chandrasekhar Reacts Rashmika Morph Video - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/10/rashmika.jpg.webp?itok=2oNZb_Nk)
సాక్షి, హైదరాబాద్: నటి రష్మిక మందన్న పేరిట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోల ఉదంతంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం దృష్టిసారించిందని.. కారకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారాయన.
శుక్రవారం సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి పెట్టాం. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపెడుతాయి. ఈ పరిస్థితులు ప్రమాదకరం’’ అని అన్నారాయన.
ఈ తరహా ఘటనలపై రెండేళ్లుగా కేంద్రం దృష్టిసారించిందని చెప్పిన మంత్రి రాజీవ్.. సోషల్ మీడియా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సోషల్ మీడియా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని అన్నారు.
కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌కు తేడా లేదు
పదేళ్లలో కేసీఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్గఢ్, కర్ణాటక లో మాదిరిగా గ్యారంటీల పేరుతో ఎన్నికలకు వస్తోంది. ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టో ను నమ్మట్లేదు. అందుకే గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. ఏ రాష్ట్రంలో కూడా తన గ్యారంటీలను కాంగ్రెస్ సరిగా అమలు చేయలేదు. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన అనంతరం ఇచ్చిన గ్యారంటీ లో మెలిక పెట్టింది. కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ అన్నారు. కానీ అక్కడ కరెంట్ ఉండట్లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటుంది. అధ్యధిక నిరుద్యోగ రెట్ కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌కు తేడా లేదు. దొందూ దొందే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ 65 ఏళ్ళు దోచుకుంటే.. బీఆర్ఎస్ పదేళ్లు దోచుకుంది. రెండూ కుటుంబ పార్టీలే. తెలంగాణలో బీజేపీ రావాల్సి అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment