న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక ఇనిస్టిట్యూట్ భవనం బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు చేరడానికి, ఆ నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థినులు మృతి చెందడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వమే కారణమని, ఇది ప్రమాదం కాదని, ఆ పార్టీ చేసిన హత్యలని బీజేపీ ఆరోపించింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో జరిగినది ప్రమాదం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన హత్యలు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇటీవల పటేల్ నగర్‌లో విద్యుదాఘాతంతో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థి మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఈ విధంగా చాలా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు విలేకరుల సమావేశాలు నిర్వహించడం, ప్రకటనలు ఇవ్వడం, ఆరోపణలు చేయడం తప్ప మరో పనిచేయడం లేదని పూనావాలా ఆరోపించారు.
ఢిల్లీలో ఎక్కడ చూసినా నీటి మడుగులు కనిపిస్తున్నాయని, ఇవి ప్రాణాంతకంగా మారాయన్నారు. దీనికి పూర్తి బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీదేనన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ ఈ ఘటన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్లక్ష్య పూరిత పనితీరుకు ఉదాహరణ అని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని సహచరులంతా కలసి కాలువలు శుభ్రం చేయడానికి కేటాయించిన డబ్బును కూడా తిన్నారని అరోపించారు. ఢిల్లీలో ఒక్క గంట వర్షం కురిస్తే చాలు వరదలు సంభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment