న్యూఢిల్లీ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు.
కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భక్తుల్లో కొందరు టీనేజర్ల మధ్య వాగ్వివాదం ఆరంభమైందని పోలీసు డీజీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఈ గొడవకు కారణం తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందని, గందరగోళం ఎక్కువకావడంతో ఒక్కమారుగా ఇరుకు సందులోకి అనేకమంది దూసుకువచ్చారని తెలిపారు. ఈ గందరగోళంలో ఊపిరాడక పలువురు మరణించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అధికారులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు.
చదవండి: (హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు)
కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉన్నా పలువురు భక్తులు నిర్ణీత స్థాయిని మించి ఆలయంలోకి వచ్చారని ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ సింగ్ చెప్పారు. ఆలయ బోర్డు ఏర్పాట్లలో లోపమే ఘటనకు కారణమని ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ కొందరు ఆరోపించారు. చాలామంది కనీసం మాస్కులు కూడా ధరించలేదని చెప్పారు. అధిక రద్దీతో తొక్కిసలాట జరగవచ్చని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారని, కానీ ఆలయ బోర్డు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల దుర్ఘటన జరిగిందని విమర్శించారు.
ఘటన సమయంలో వెనక్కు వెళ్లకుండా చాలామంది నేలపై పడుకున్నారని, దీంతో రద్దీ మరింత పెరిగిందని మరో సాక్షి చెప్పారు. ఇతర సాక్షులు కూడా ఈ విషయాలను ధృవీకరించారు. అయితే ఆలయ బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. 50 వేల మందికి అనుమతి ఉన్నా 35 వేల మందికే అనుమతిచ్చామని తెలిపింది. రెండు గ్రూపుల మధ్య ఆరంభమైన గొడవ అంతిమంగా తొక్కిసలాటకు దారితీసిందని ఆలయ బోర్డు ప్రకటించింది.
చదవండి: (వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట)
Comments
Please login to add a commentAdd a comment