బీహార్‌లో అధికార ఎన్డీయే కూటమికి జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) ఊహించని షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ, బీహార్‌లో మాత్రం దానిని అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామం బీజేపీని షాక్‌కు గురి చేసినట్లయింది.
ఇదే విషయమై జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ మాట్లాడుతూ.. "పార్లమెంటులో బిల్లుకు మద్దతు పలికినప్పటికీ, బీహార్‌లో యూసీసీ అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. మా పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు" అని తేల్చిచెప్పారు.
2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శ్యామ్ రజక్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం బీహార్‌లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ రజక్ స్పందిస్తూ, ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతోనే నడుస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. యూసీసీపై తమ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉన్నందున, రాష్ట్రంలో దాని అమలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఈ పరిణామాలపై ప్రతిపక్ష ఆర్జేడీ స్పందించింది. ఇటీవల ఎదురైన రాజకీయ ఎదురుదెబ్బల తర్వాత బీజేపీ మళ్లీ 'ద్వేష రాజకీయాల'కు పాల్పడుతోందని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ విమర్శించారు. బీహార్ ప్రజలు లౌకికవాదులని, రాష్ట్రంలో యూసీసీని అమలు చేయాలని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు


