సాక్షి, చెన్నై: మూడో కూటమి ఏర్పాటైతే తానే సీఎం అభ్యర్థి అని మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్ అన్నారు. జనవరిలో పొత్తు ప్రకటన ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారానికి తిరుచ్చి నుంచి ఆదివారం కమలహాసన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తిరుచ్చి వెళ్లిన ఆయన అక్కడ సుడిగాలి పర్యటన చేశారు. మహిళా సంఘాలు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు ఇలా అన్ని వర్గాలను కలుసుకున్నారు. సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. సోమవారం కమల్ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
జనవరిలో పొత్తు ప్రకటన..
రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షం తదుపరి మూడో పక్షంగా మక్కల్ నీది మయ్యం అవతరించిందని తెలిపారు. ప్రజలు తమను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. జనవరిలో పొత్తు ప్రకటన అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మూడో కూటమి ఏర్పాటైన పక్షంలో ఆ కూటమి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానని పేర్కొన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం తనకు ముఖ్యమన్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ద్రవిడ పార్టీయే అని స్పష్టం చేశారు.
తమిళం మాట్లాడే వాళ్లందరూ ద్రవిడులేనని అన్నారు. అవసరం అయితే కలైంజర్ కరుణానిధి పేరును కొన్ని చోట్ల ప్రస్తావిస్తా మన్నారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగుతోందన్నారు. దివంగత నేత ఎంజీఆర్ తరహాలో అవినీతి రాయుళ్లపై కొరడా ఝుళిపించేందుకు ఈ పాలకులు సిద్ధమా..? అని ప్రశ్నించారు. ఏఏ పనులకు ఏ మేరకు లంచం ముట్ట చెప్పాల్సి ఉందో ఓ చిట్టాను కమల్ ప్రకటించారు. తనను రెండేళ్ల క్రితమే రోడ్డున పడేయడానికి ఈ పాలకులు ప్రయత్నించారని, వాటన్నింటిని ఎదుర్కొన్న తాను మున్ముందు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment