సంబరాలు చేసుకుంటున్న తులసేంద్ర పురం గ్రామస్తులు
సాక్షి, చెన్నై : తమిళ సంతంతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడంతో ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి ఇంటింటా రంగోళిలతో కమలా హ్యారిస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు దీపావళిముందే వచ్చిసిందన్నట్టుగా ఆనందోత్సాహాల్లో మునిగారు. కమలా హ్యారిస్ పూర్వీకం తమిళనాడు లోని తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామం. ఆమె తల్లి తరపు తాత ముత్తాలు ఇక్కడి వారే. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాహ్యారిస్ పేరు ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. కమలా హ్యారిస్ తమ ఇంటి బిడ్డగా భావించిన గ్రామస్తులు ఆమె విజయకేతనం ఎగుర వేయాలని కాంక్షిస్తూ ఆ గ్రామంలోని గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలోప్రతి రోజూ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవదులు లేవు.
ఆదివారం ఆ గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో విశిష్టపూజలు జరిగాయి. గ్రామంలో కమలా హ్యారిస్ చిత్ర పటాలతో ప్లకార్డులు, చిన్న చిన్న హోర్డింగ్‌లు హోరెత్తాయి. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంటింటా ముగ్గులు వెలిశాయి. బాణా సంచాల్ని పేల్చారు. స్వీట్లు పంచి పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఇక, అమెరికా ఉపాధ్యక్షురాలి హోదాలో ఒక్క సారైనా పూర్వీక గ్రామానికి రావాలని కమలా హ్యారిస్‌కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కమలా హ్యారిస్ తమిళనాడు కు సీఎం పళని స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు
డాక్టర్ సరళగోపాలన్
మొక్కులు తీర్చిన చిన్నమ్మ
చెన్నై బీసెంట్ నగర్‌లో ఉన్న కమలా హ్యారిస్ చిన్నమ్మ డాక్టర్ సరళగోపాలన్ ఆనందానికి అవదులు లేవు. బీసెంట్ నగర్‌లోని వర సిద్ధి వినాయకుడి ఆలయంలో 108 కొబ్బరి కాయల్ని ఆదివారం కొట్టి, మొక్కులు తీర్చుకున్నారు. కమలా హ్యారిస్ చెన్నైకు వచ్చినప్పుడు ఇక్కడి వరసిద్ధి వినాయకుడి ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టే వారు అని ఈసందర్భంగా సరళ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన కోసం ఆలయంలో కొబ్బరి కాయ కొట్టాలని కమలా సూచించారని, అందుకే ఆమె తరపున మొక్కును తీర్చుకున్నట్టు తెలిపారు. కమలా హ్యారిస్ మేన మామ గోపాలన్ బాలచంద్రన్ పేర్కొంటూ, తమ కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉందన్నారు. అవ్వా తాతల్ని చూసేందుకు ఇది వరకు చెన్నైకు పలు మార్లు కమలా వచ్చారని, అలాగే, చండీగర్‌కు కూడా వెళ్లేవారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment