న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కన్హయ్య వెంట గుజరాత్ దళిత యువ నేత, స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
సాంకేతిక కారణాలతో ఇప్పుడే కాంగ్రెస్‌లో చేరట్లేదని జిగ్నేష్ చెప్పారు. ఇప్పుడు పార్టీలో చేరితే స్వతంత్య్ర ఎమ్మెల్యేగా కొనసాగడం కుదరదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీదనే బరిలో దిగుతానని స్పష్టంచేశారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్(ఆర్‌డీఏఎం) కన్వీనర్ అయిన జిగ్నేష్ గుజరాత్‌లోని వద్గామ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు యువ నేతలు కాంగ్రెస్‌కు మద్దతివ్వడం పార్టీకి బాగా కలిసొచ్చే అంశం.
గుజరాత్‌లో దళితులకు దగ్గరవుతున్న కాంగ్రెస్‌కు జిగ్నేష్ మద్దతు వచ్చే ఎన్నికల్లో లాభం చేకూర్చనుంది. 2019లో సీపీఐలో చేరిన కన్హయ్య బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. బెగుసరాయ్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌తో పోటీపడి ఓటమి పాలయ్యారు. మరోవైపు, కన్హయ్య కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ స్పందించింది. ఆయనను బెగూసరాయ్‌లో ప్రజలు తిరస్కరించారని, రాజకీయంగా ఎదిగేందుకే పార్టీ మారారని బిహార్ బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి మంగళ్ పాండే ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment