కర్ణాటక శాసనసభ ఎన్నికల సమరాంగణంలో ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 10న పోలింగ్ జరుగుతుంది. 13న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తిగా తన భుజస్కంధాలపై మోశారంటే ఈ ఎన్నికల్లో విజయం బీజేపీకి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.
సుదీర్ఘమైన రోడ్డు షోలు, బహిరంగ సభల్లో మోదీ పాల్గొన్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. బహుశా ఏ రాష్ట్రంలోనూ మోదీ ఈ స్థాయిలో ప్రచారం సాగించి ఉండకపోవచ్చు. పార్టీ అభ్యర్థులను కాదు, మోదీని చూసి బీజేపీకి ఓటు వేయాలన్నట్లుగా పరిస్థితి మారిపోవడం విశేషం. ఆయన ఒక్కరే పూర్తిగా తెరపైన కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
1985 నుంచి కర్ణాటకలో అధికార పార్టీ వరుసగా రెండోసారి నెగ్గిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రంలో బీజేపీకి అంతా తానై వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపికను సైతం తన చేతుల్లోకి తీసుకున్నారు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. కొందరు సీనియర్లు టికెట్ దక్కక అలకబూని, పార్టీని వీడి వెళ్లిపోయినా లెక్కచేయలేదు. మోదీ లెక్కల్లో వారు ఇమడలేదు మరి. ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పిన ప్రధాని ఏప్రిల్ 29 నుంచి స్వయంగా రంగంలోకి దిగారు.
క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి, ప్రచారాన్ని హోరెత్తించారు. దాదాపు రాష్ట్రం మొత్తం చుట్టేశారు. రాజధాని బెంగళూరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మూడు రోడ్డుషోలలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ ఆవశ్యకతను పదేపదే నొక్కిచెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అనాలోచితంగా అందించిన బజరంగ్‌దళ్‌పై నిషేధాస్త్రాన్ని చక్కగా అందిపుచ్చుకున్నారు. చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆ పార్టీని ఇరుకున పెట్టారు. ప్రచార సభల్లో జై బజరంగబళి అంటూ మోదీ చేసిన నినాదంతో జనం గొంతు కలిపారు. తద్వారా ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేశారు. ఒకరకంగా చెప్పాలంటే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోదీ ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారారు.
క్యాడర్‌లో ఫుల్ జోష్
2018లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి మోదీ ప్రచార ఉధృతి బాగా పెరిగింది. అక్కడక్కడ స్థానిక కన్నడ భాషలో మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. బీజేపీని పూర్తి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక దక్షిణాది జిల్లాలో హిందీ ప్రభావం తక్కువ. అక్కడ బహిరంగ సభల్లో మోదీ చేసిన హిందీ ప్రసంగాలను బీజేపీ నేతలు కన్నడంలోకి అనువదించారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ అవినీతి, 40 శాతం కమిషన్లు, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలు మోదీ చాతుర్యంతో పక్కకుపోయాయి. మతం కోణమే ప్రధాన ప్రచారాంశంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. మోదీ ఎదురుదాడి వల్ల కాంగ్రెస్ తన ప్రచార వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో గట్టెక్కవచ్చని తొలుత కొన్ని సర్వేల్లో తేలింది. దాంతో కొంత నిరాశలో మునిగిన బీజేపీ శ్రేణుల్లో మోదీ ప్రచారం నైతిక స్థైర్యాన్ని పెంచిందని అంటున్నారు. ప్రధానమంత్రి సభలకు లక్షలాది మంది తరలిరావడం తమలో నూతనోత్సాహాన్ని నింపిందని సాక్షాత్తూ బీజేపీ నాయకులే చెబుతున్నారు.
ప్రముఖులతో వ్యక్తిగత భేటీలు
కర్ణాటక కోస్తా తీరం, మల్నాడ్ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టుంది. సహజంగానే అక్కడ మోదీ సభలు విజయవంతమయ్యాయి. విపక్ష జేడీ(ఎస్)కు కంచుకోటగా భావించే పాత మైసూర్‌లోనూ పాగా వేయడమే లక్ష్యంగా ఆ ప్రాంతంలో ప్రచారానికి ప్రధానమంత్రి ప్రాధాన్యం ఇచ్చారు. బీజేపీ ప్రభావం నామమాత్రమైన హసన్, రామనగర జిల్లాల్లో ఆయన ర్యాలీలకు జనం భారీగానే తరలివచ్చారు. వారం రోజుల ప్రచారంలో మోదీ దాదాపు 3,000 మందిని వ్యక్తిగతంగా కలిసి ముచ్చటించారు. వీరిలో వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులు, పద్మా పురస్కారాల గ్రహీతలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. 18 బహిరంగ సభలు, ర్యాలీల్లో ప్రధాని ప్రసంగించారు. బెంగళూరులో మూడు, మైసూర్, కలబుర్గి, తుమకూరులో ఒక్కొక్కటి చొప్పున రోడ్డు షోలలో పాలుపంచుకున్నారు.
జనాకర్షణ శక్తికి పరీక్ష
లోక్‌సభ, శాసనసభ ఎన్నికల మధ్య కర్ణాటక ఓటర్లు స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తేటతెల్లమవుతోంది. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం స్థానాలు గెలుచుకుంది. ఆ మరుసటి ఏడాది 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 25 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈసారి ప్రధాని మోదీ వ్యక్తిగత జనాకర్షణ శక్తికి ఈ ఎన్నికలు పరీక్ష అనడంలో సందేహం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో గెలిచి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆయన ప్రతిష్ట అమాంతం పెరిగిపోవడం ఖాయం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment