శివమొగ్గ జిల్లాలో ప్రచారసభలో మోదీకి జ్ఞాపిక
శివమొగ్గ/బనశంకరి: భారతదేశం నుంచి కర్ణాటకను వేరు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని, అందుకోసం బహిరంగంగానే పిలుపునిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ వ్యాధి ఆ పార్టీలో టాప్ లెవల్‌కు చేరిందని అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే విషయంలో కాంగ్రెస్ ‘రాజ కుటుంబం’ ముందంజలో ఉంటుందని ఆరోపించారు. తన మనసులో చాలా బాధ ఉందని అన్నారు.
ఆ రాజ కుటుంబం మన దేశంలో విదేశీ శక్తుల జోక్యాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ఆటలను దేశం ఎప్పటికీ క్షమించబోదని తేల్చిచెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం మైసూరు జిల్లాలోని నంజనగూడులో బహిరంగ సభలో మాట్లాడారు. భారత్‌ను ద్వేషించే విదేశీ ప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ రహస్యంగా సమావేశమవుతోందని, మన దేశ సార్వభౌమత్వాన్ని కించపర్చే చర్యలకు తరచుగా పాల్పడుతోందని, అందుకు ఆ పార్టీ ఏమాత్రం సిగ్గుపడడం లేదని దుయ్యబట్టారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పరివారం అన్ని పరిమితులు దాటేసిందని, కర్ణాటక సార్వభౌమత్వాన్ని కాపాడతామని చెబుతోందని, తద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. అసలు కర్ణాటక సార్వభౌమత్వం అంటే ఏమిటో చెప్పాలని నిలదీశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఇలాంటి మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక భారతదేశంలో లేదని కాంగ్రెస్ భావిస్తోందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో కర్ణాటక అంతర్భాగమని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని, బీజేపీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నంజనగూడులో ప్రచారం తర్వాత ప్రధానమంత్రి శ్రీకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. నంజుండేశ్వర స్వామి వెండి ప్రతిమను బీజేపీ నేతలు ప్రధానికి బహూకరించారు.
ప్రజల మద్దతు మాకే..
కర్ణాటకలో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల మద్దతు సంపూర్ణంగా లభిస్తోందని, వారు తమను ఆశీర్వదిస్తున్నారని, రాష్ట్రంలో తాము మరోసారి అధికారంలోకి వస్తామన్న పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదివారం శివమొగ్గ సమీపంలోని ఆయనూరులో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 30 లక్షల ఉద్యోగాలను కల్పించిందని చెప్పారు.
మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగిందని అన్నారు. అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తోందని, అబద్ధాలను చెబుతోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రచారం కోసం సోనియా గాంధీని రప్పించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధాల గాలి బుడగను ప్రజలు పగులగొట్టడం ఖాయమని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment