కార్యక్రమంలో గెహ్లాట్, మోదీ మంతనాలు
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కేవలం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం వీలైనన్ని అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేసిందన్నారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లోని అబూ రోడ్‌లో ర్యాలీలో మాట్లాడారు. ‘‘సుడాన్ అంతర్యుద్ధంలో చిక్కిన కర్ణాటక హక్కీపిక్కీ గిరిజనుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు కూడా కాంగ్రెస్ వెనకాడలేదు. వారి ప్రాణాలు అక్కడ ప్రమాదంలో ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టింది. తద్వారా ఒకరిద్దరైనా చనిపోకపోతారా అని చూసింది. అదే జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగా చూపి కర్ణాటకలో ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నింది’’ అన్నారు.
ఉగ్రవాదం పట్ల మెతక వైఖరి
సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అవలంబించడం కాంగ్రెస్ నైజమని మోదీ మండిపడ్డారు. జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో ఉద్దేశపూర్వకంగానే కోర్టులో సరిగా వాదనలు విన్పించకుండా నిందితులంతా విడుదలయ్యేందుకు రాజస్తాన్ సర్కారు సహకరించిందన్నారు. ‘‘ఐదేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో సిగ్గుచేటైన రాజకీయ పోరాటం సాగుతోంది. సీఎంతో సహా నేతలంతా కుర్చీ కోసం కొట్టుకోవడంలో మునిగిపోయారు. ప్రజలను, పాలనను గాలికొదిలేశారు’’ అంటూ ధ్వజమెత్తారు.
‘‘సీఎం అశోక్ గహ్లోత్‌కు సొంత ఎమ్మెల్యేలపైనే విశ్వాసం లేదు. వారికీ ఆయన మీద నమ్మకం లేదు’’ అంటూ చెణుకులు విసిరారు. 2020లో అసమ్మతి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగరేసినప్పుడు వసుంధర రాజె సింధియా వంటి రాష్ట్ర బీజేపీ అగ్ర నేతల మద్దతుతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగానని గహ్లోత్ ఆదివారం చెప్పడం తెలిసిందే.
అంతకుముందు నాథ్‌ద్వారాలో రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం గహ్లోత్‌తో కలిసి మోదీ శంకుస్థాపన చేశారు. దేశానికి ఏ మంచి జరిగినా కాంగ్రెస్, విపక్షాలు భరించలేవంటూ ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ప్రతిదాన్నీ ఓట్ల కోణం నుంచే చూసేవాళ్లు దేశం కోసం ఏమీ చేయలేరన్నారు. అందువల్లే రాజస్తాన్ వంటి రాష్ట్రాలు మౌలిక ప్రాజెక్టులకు నోచుకోక వెనకబడ్డాయన్నారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులను గహ్లోత్ ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకెళ్లడం విశేషం.
జూన్‌లో అమెరికాకు మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు పర్యటిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 22న మోదీకి బైడెన్ విందు ఇస్తారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి మోదీ పర్యటన ఉపయోగపడుతుందని వైట్‌హౌస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment